సారాపై సమరభేరి ‘రోశమ్మ’

Rosammదూబగుంట రోశమ్మ కన్నుమూశారు. సారాకి వ్యతిరేకంగా పోరాడి, తెలుగునాటే కాకుండా దేశంలోనే పాపులర్ అయిన రోశమ్మ.. 93 ఏళ్ళ వయసులో దూబగుంట గ్రామంలో మరణించారు. రోశమ్మ నాయకత్వంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగానే 1993లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలుచేసింది.

దూబగుంట రోశమ్మ అసలు పేరు వర్థినేని రోశమ్మ. దూబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టడంతో ఆ ఊరి పేరు మీద ‘దూబగుంట రోశమ్మ’ అయిపోయింది. 1992 లో దూబగుంటలో జరిగిన సంఘటన రోశమ్మ ఉద్యమదీక్షకు కారణమైంది. వయోజన విద్య వాలంటీర్లమీద ఇద్దరు తాగుబోతులు దౌర్జన్యం చేశారు. దీనితో రోశమ్మ సారాపై యుద్ధభేరి మోగించింది. రోశమ్మ భర్త కూడా సారాకు బానిస. కుటుంబాన్ని సరిగా చూసుకునేవాడు కాదు. ఎన్నోఏళ్ళుగా భర్తవల్ల లెక్కలేనన్ని బాధలు పడ్డ రోశమ్మకు తాగుబోతులంటే అసహ్యం. అందుకనే, విద్యా వాలంటీర్లమీద తాగుబోతుల దౌర్జన్జాన్ని సహించలేకపోయింది. సారాకి వ్యతిరేకంగా పోరాడాలని డిసైడయింది. కొంతమందితో కలసి….ఊళ్ళో ఉన్న సారాయి దుకాణంమీద ఎటాక్ చేసింది. చీపుళ్ళు, కారం మాత్రమే ఆయుధాలుగా చేసిన ఈ దాడితో షాపు మూసేయాల్సి వచ్చింది.

సారాపై పోరాటంతో ఒక్కసారిగా రోశమ్మ పేరు మార్మోగిపోయింది. రాష్ట్రంలో అనేకచోట్ల సారా వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. రోశమ్మ 7 జిల్లాల్లో తిరిగి ఉద్యమకారులకు అండగా నిలిచారు. ప్రభుత్వ పెద్దలు కూడా వణికిపోయారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు ఈ ఆందోళనకు మద్దతు పలికడమే కాకుండా అధికారంలోకి వచ్చాక. మద్యనిషేధాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక మద్యనిషేధాన్ని ఎత్తేసింది. ఒకప్పుడు సారా వ్యతిరేక ఉద్యమానికి ప్రాణం పోసిన దూబగుంటలోనే ఈవేళ 5 బెల్టుషాపులున్నాయి.

రోశమ్మ చాలాకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. డయాలసిస్ పైనే ఇన్నాళ్ళూ ఉన్నారు. ప్రతిసారీ నెల్లూరు సిటీకి వెళ్ళి డయాలసిస్ చేయించుకోవడం ఇబ్బందిగా ఉందని, అదీకాక, డబ్బు సమస్య కూడా ఉందని రోశమ్మ చెప్తుండేవారు. కిడ్నీ వ్యాధితో మంచంపట్టిన రోజుల్లో వీ6 తో రోశమ్మ స్వయంగా ఈ విషయం చెప్పారు.

రోశమ్మకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఆగిపోయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆరోగ్యశ్రీ కింద ఆమెకు డయాలసిస్ చేసేవారు. ఆమె కొడుకులు రోజుకూలీలు. ఈ ఇంట్లోనే రోశమ్మ చివరిరోజులు గడిచాయి.  చదువు లేని పల్లెటూరి రోశమ్మ మద్యపాన నిషేధానికి దోహదపడడం తెలుగువారెవరూ మర్చిపోలేరు. రోశమ్మ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy