సాహసం షోయబుల్లాఖాన్ ఊపిరి

షోయబ్_ఉల్లాఖాన్షోయబుల్లా ఖాన్ … అసలుసిసలు జర్నలిస్ట్. పత్రికా స్వేచ్ఛ కోసం ప్రాణాలొదిలిన తొలి కలం వీరుడు షోయబుల్లా ఖాన్. ఆయన పుట్టింది ఈ రోజే. ఖమ్మం జిల్లాలోని సుబ్రవేడులో పుట్టారు. ముస్లిం మత దురహంకారానికి వ్యతిరేకి.  ఇమ్రోజ్ పత్రికతో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చేలా షోయబ్ రచనలు సాగాయి. ‘‘మరణం అనివార్యం. చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి’’ అంటూ షోయబుల్లా ఖాన్ తుది శ్వాస విడిచారు. అలాంటి మహనీయుడికి అక్షరాంజలి ఘటిస్తూ…. ఆయన జీవనచిత్రం క్లుప్తంగా మీకోసం….

అక్షరంగా మారడానికి 1919 అక్టోబర్ 17న ఓ అగ్నికణం కళ్లు తెరిచింది.. ఆ అగ్నికణమే షోయబుల్లాఖాన్. ఖమ్మం జిల్లా సుబ్లేడ్ లో పుట్టాడు. తల్లి షయిబుల్లా.. తండ్రి హీబీబుల్లా.. రైల్వేలో కానిస్టేబుల్ కావడంతో హబీబుల్లాకు హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీలో షోయబుల్లా ఖాన్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. తెలంగాణ అగ్నిగోళంలా మండుతోన్న కాలమది…. దొరల దోపిడి సాగదంటూ సామాన్యుడు సమరం సాగిస్తున్న సమయమది. రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురిస్తూ హైదరాబాద్ లో రగల్ జెండా రెపరెపలాడుతున్న రోజులవి. సరిగ్గా అప్పుడే గుండెల నిండా ప్రజాస్వామ్య కాంక్షతో.. దౌర్జన్యాన్ని ఎదురించే చైతన్యంతో క్యాంపస్ నుంచి షోయబుల్లా ఖాన్ బయటకొచ్చాడు. తాను చదివిన చదువుకు.. కోరుకుంటే  ఏ ఉద్యోగమైనా కాళ్ల దగ్గరకే వచ్చేది.. నిర్బంధాన్ని ప్రశ్నించే ధైర్యం నరనరాన పాకుతుంటే.. తలదించుకుని ఉద్యోగం చేయాలా? అందుకే అక్షరాన్ని ఆయుధంగా మార్చి నియంతృత్వంపైనే సమరం చేయాలనుకున్నాడు. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించాడు.

ఉర్దూ అధికార భాషగా ఉన్న ఆ కాలంలో పత్రికలన్నీ నిజాంకు అనుకూలంగా ఉండేవి.. ఏవో ఒకటి రెండు పత్రికలు తప్ప.. షోయబుల్లాఖాన్ అలాంటి పత్రికనే ఎంచుకున్నాడు.. తేజ్ అక్బార్ లో చేరాడు… రజాకార్లు, భూస్వాముల ఆగడాలపై ప్రతీరోజూ అక్షరాలను ఎక్కుపెట్టాడు..ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలకు అందించాడు..అందుకే తేజ్ అక్బార్ ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. కణకణమండుతోన్న నిప్పుకణిల్లాంటి షోయబుల్లాఖాన్ అక్షరాలకు అవకాశం ఇవ్వడానికి రయ్యత్ ముందుకొచ్చింది. అక్కడ షోయబుల్లాఖాన్ ఆవేశానికి అక్షరాలు కట్టలు తెంచుకున్నాయి..ఆ కలంపోటు నిజాంను ఉక్కిరిబిక్కిరిచేసింది..దీంతో దాన్ని బంద్ చేయించాడు.

నిజాం దౌర్జన్యాన్ని ఎదురించడానికి సొంత పత్రిక ఉంటేనే మంచిదనుకున్నాడు షోయబుల్లాఖాన్. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో భార్య, తల్లి నగలను అమ్మి ఇమ్రోజ్ ను స్థాపించాడు. 1947 నవంబర్ 17న మొదటి సంచిక వెలువడింది. అందులో షోయబుల్లా పెన్ను గన్నయింది. బుల్లెట్లలా అక్షరాలు నిజాం గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఆయన రాతలు రజాకార్లకు వాతలు పెట్టాయి. వెన్నులో వణుకుపుట్టడంతో ఖాసీం రజ్వీ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అయినా షోయబుల్లాఖాన్ అక్షరాలు తడబడలేదు. మరిన్ని అన్యాయాలను ఎండగట్టాడు. ఎర్రకోటపై నిజాం జెండా ఎగరవేస్తానన్న రజ్వి ప్రకటనతో.. షోయబుల్లాఖాన్ రక్తం కుతకుతలాడింది. రజ్వీ దురహంకారాన్ని ఇమ్రోజ్ లో తీవ్రంగా వ్యతిరేకించాడు. నిజాంను వ్యతిరేకిస్తూ వార్తలు రాస్తే చేతులు నరికేస్తామని.. పత్రికను సర్వనాశనం చేస్తామని రజ్వీ బహిరంగంగానే బెదిరించాడు. అయినా షోయబుల్లా ఖాన్ తగ్గలేదు. సత్యాన్వేషణలో ప్రాణాలు పోవడం గర్వించాలన్న విషయమన్నాడు. అప్పుడే అతని అంతానికి ఆరంభం మొదలయింది.

1948 అగష్టు 22.. కాచీగూడలోని ఇమ్రోజ్ ఆఫీసులో వర్క్ కంప్లీట్ చేసుకుని అర్ధరాత్రి ఇంటికి బయలుదేరాడు షోయబుల్లా.. బావమరిది ఇస్మాయిల్ ఖాన్ కూడా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. ఒక్కసారిగా పదిమంది దుండగలు షోయబుల్లాఖాన్ పై విరుచుకుపడ్డారు.. తన రాతలతో రజ్వి గుండెకు చెమటలు పట్టించిన చేతులను నరికేశారు.. భయమంటే తెలియని ఆ గుండెపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు… అడ్డుకోబోయిన ఇస్మాయిల్ నూ వదల్లేదు.. అయితే తుపాకీ చప్పుళ్లు విని స్థానికులు బయటకురావడంతో దుండగులు పారిపోయారు.. నెత్తిటి మడుగులో ఉన్న షోయబుల్లాను ఉస్మానియాకు తరలించారు..రెండు గంటల తరువాత స్పృహలోకి వచ్చిన షోయబుల్లా.. ఇమ్రోజను కొనసాగించమన్నాడు..ధర్మానిదే గెలుపని కన్నుమూశాడు.

హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాలన్నది షోయబుల్లాఖాన్ కల.. దాని కోసం నడిరోడ్డు మీదనే ప్రాణాలను బలిపెట్టాడు. దేహంతో మొదలయ్యే జీవన ప్రస్థానం దేహంతోనే అంతమవుతుంది..కాని ఓ వీరుని రక్తపు చుక్క వేల వీరులకు జన్మనిస్తుంది. ప్రాణం తీయవచ్చు.. కానీ ఆశయాన్ని చంపలేరు. అందుకే అక్షరమే ఆయుధంగా నిరంకుశత్వంపై పోరాడిన కలం వీరుడు షోయబుల్లాఖాన్ వారసత్వాన్ని ప్రతి జర్నలిస్టు కొనసాగించాలి. ఆత్మగౌరవ పాలన కోసం సాగుతున్న అస్తిత్వపోరులో అక్షరసేనానులగా మారిన ప్రతీ జర్నలిస్ట్ కలంలో షోయబుల్లాఖాన్ బతికే ఉంటాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy