సాహిత్యాభిలాషులందరికి ఆహ్వానం : సీఎం కేసీఆర్

cmkcr-610

 

ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే అన్న ప్రాతిపదికన సభలు నిర్వహించాలన్నారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు. ఈ మహాసభలకు ప్రతి సాహిత్యాభిలాషి హాజరుకావొచ్చన్న సందేశం వెళ్లాలని సూచించారాయన. ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా సాహిత్యం, భాష ప్రాధాన్యంగా జరుగాలని, ప్రధాన వేదిక అయిన లాల్‌బహదూర్‌శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన ఐదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమీక్ష సమావేశం సోమవారం మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలపాటు ప్రగతిభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశమన్నారు.

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలకు సత్కారం

నూటికి నూరు శాతం ఆహ్వానితులను తగు రీతిలో గౌరవించాలని, సౌకర్యాలు కలిగించాలన్నారు. 13 గుర్తింపు పొందిన భారతీయ భాషల్లో జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీతలను వివిధ రాష్ర్టాల నుంచి ప్రత్యేకంగా ఆహ్వానించి తగురీతిలో సత్కరించాలన్నారు.  ఇంతమంది ఇతర భాషల వారికి సన్మానం చేశామన్న కీర్తి తెలుగు మహాసభల సందర్భంగా మనకు దక్కాలన్నారు ఎక్కడా ఏ లోటు రాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు సీఎం. ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వస్తున్నారని, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఉభయ తెలుగు రాష్ర్టాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ విశిష్ట అతిథులుగా వస్తున్నారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ ప్రకటన ఉపరాష్ట్రపతి చేయగానే పెద్ద ఎత్తున పటాకులు కాల్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ వస్తున్నారని తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వివిధ దేశాలు, పొరుగు రాష్ర్టాలనుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తున్నారో ఆరా తీశారు. మొత్తం సుమారు ఎనిమిది వేల మంది హాజరవుతున్నట్టు వారు సీఎంకు తెలిపారు.

ప్రతినిధులకు సకల సౌకర్యాలు

ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో సహా అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలని, భోజనాలు, బస, ఇతర లాజిస్టిక్స్ తదితరాల్లో ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవాలని చెప్పారు సీఎం. వివిధ వేదికల వద్ద జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులు అక్కడికి చేరుకోవటానికి, ఆ తరువాత సాయంత్రం పూట ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం చేరుకోవటానికి తగిన సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రతి ప్రతినిధితో మాట్లాడి, వారి అభిలాష కనుక్కుని, దానికి అనుగుణంగా ఎవరెవరు ఎక్కడికి వెళతారో ఆ విధంగానే రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో కార్యక్రమాల ప్రారంభానికి గంట ముందుగానే ఇతర వేదికల వద్ద కార్యక్రమాలు ముగిసేలా చూడాలని అన్నారు. ఎల్బీ స్టేడియం వద్ద ప్రతిరోజు తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించాలని, సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరుగాలన్నారు సీఎం. విదేశాల నుంచి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ప్రతినిధులు ఎవరెవరు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ వేదికల వద్ద జరిగే సభలకు హాజరవుతారో వివరాలు రూపొందించి, దానికి అనుగుణంగానే సౌకర్యాలు కలిగించాలన్నారు. విదేశీ ప్రతినిధులకు రవాణాకు కార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎల్బీ స్టేడియంకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, ఇతర సాహిత్యాభిలాషులు హాజరవుతారు కాబట్టి పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే సభల ప్రారంభం నాటి నుంచే ఫుడ్ కోర్ట్స్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy