సినిమావాళ్ల బహిరంగ లేఖ: మాకు కష్టమొచ్చింది.. సానుభూతి కోరుకుంటున్నాం

cm-kcrసీఎం కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసింది సినీ పరిశ్రమ. డ్రగ్స్ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. కానీ సినీ పరిశ్రమపై తీవ్రంగా స్పందించడం బాధాకరమని తెలిపింది. ప్రభుత్వానికి, పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు సినీ పెద్దలు. లేఖ పూర్తి సారాంశం….

 

 

 

మాన్యశ్రీ గౌవర ముఖ్యమంత్రి గారికి,

తెలుగు సినిమా రూ.2000 కోట్లు దాటిన సంతోషంలో..

ఒక దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంలో..

తెలుగు సినిమా పరిశ్రమ వెలిగిపోతున్న సమయంలో

మ్మల్ని కమ్మిన గ్రహణం మాదక ద్రవ్యం కేసు.

విలన్లు నెగ్గిన సినిమాలు తీయడం.. ఈ పరిశ్రమకు అలవాటు లేదు.

చెడు మీద మంచి గెలవడం అనే కథనే అరవై ఏళ్లుగా చెప్తూ కుటుంబ విలువలు బైట సమాజంలో ఎలా ఉన్నా కనీసం సినిమాల్లో అయినా అవి బలంగా ఉండాలని నమ్మే పరిశ్రమలో పని చేస్తున్నాం.

మాకు సమాజం పట్ల ఎంత గౌరవం లేకపోతే తగ్గిపోతున్న మానవీయ విలువల్ని ఇంకా పట్టుకుని ముందుకు తీసుకువెళుతున్నాము. ఎందుకంటే అవి కాలాతీతం.

మాకు మాదకద్రవ్యాలు సేవించేవాళ్లు ఎప్పటికీ హీరోలు కారు, అతికొద్ది మంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం.

క్రమశిక్షణ లేని వాళ్లని పరిశ్రమ భరించినట్లు ఒక్క మచ్చు తునక కూడా ఎక్కడా లేదు. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం ఉన్న వ్యక్తులే ఇక్కడ నిలదొక్కుకొని మనగలరు.

ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్లు వాళ్లంతట వాళ్లే తెరమరుగైపోతారు.

కానీ మా వంతు మేం.. వారి మీద క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, పోలీసులకి పూర్తిగా సహకరిస్తాం.

మేం కోరుకునేదల్లా ఒక్కటే..

మేం ఏ వర్గం మీద – కులం మీద – మతం మీద – ప్రభుత్వం మీద ఒక్క చెడ్డమాట లేకుండా సినిమా తీసే ప్రయత్నం చేస్తాం.

కానీ ప్రతి వాళ్లు సినిమావాళ్ల మీద ఇంత తీవ్రంగా స్పందించడం మా అందరికీ చాలా బాధించింది.

ఎవరికో కష్టమొస్తే జోలె పట్టుకుని విరాళాలు సేకరించిన కథానాయకులు ఉన్న పరిశ్రమ ఇది. మాకు కష్టమొచ్చినప్పుడు, సమాజం నించి, మీడియా నించి కొంచెం సానుభూతి కోరుకుంటున్నాం.

ఇది మా అందరికీ ఓ కుదుపు. అలసత్వంతో ఉండకూడదని ఒక హెచ్చరిక!

దీన్ని వెలుగులోకి తెచ్చినందుకు మీ ప్రభుత్వ వ్యవస్థకు మా కృతజ్ఞతలు.

కానీ మొత్తం సినీ పరిశ్రమ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, ఈ పరిశోధన కొంచెం హుందాగాముందుకు తీసుకెళ్లమని మాత్రమే కోరుతున్నాం.

ఒక పరిశ్రమగా పరిగణిస్తే.. సినిమా ఆదాయం పరిమితమే కానీ.. ప్రభావం చాలా పెద్దది. పనిచేసేది కొన్నివేల మందే కానీ.. ప్రభావితం చేసేది కొన్ని కోట్ల మందిని. కాబట్టి ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించాలని కోరుతున్నాం.

మొత్తం సినీ పరిశ్రమ తరఫున, ఈ మాదక ద్రవ్యాల కేసుని ఎంతో ధైర్యంగా బైటికి తెచ్చిన తీరు, సమాజంలోని విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లోని యువతని పెడత్రోవ పట్టిస్తున్న ఈ మత్తు భూతాన్ని తరిమికొట్టడంలో మీరు చూపిస్తున్న తెగువని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు చేపట్టిన ఈ బృహత్కార్యంలో మా వంతు సహకారం అందించడానికి శాయశక్తులా కృషి చేస్తాం.

సినీ పరిశ్రమకు ఈ పది రోజులూ చీకటి రోజులు. అయినా గ్రహణం గంట సేపే ఉంటుంది. కానీ ప్రయాణం నిరంతరం సాగుతూనే ఉంటుంది.

సదా ప్రజా శ్రేయస్సు కోసం శ్రమించే మనస్సున్న ముఖ్యమంత్రి గారికి వినమ్రతతో…

ఇట్లు

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్

తెలుగు చలన చిత్ర మండలి

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy