సీఎంగా కేసీఆర్ తొలి ప్రసంగం : హామీల అమలుకు ప్రాధాన్యం..

KCR-AS-CMతెలంగాణ సీఎం హోదాలో తొలి సారి కేసీఆర్ ప్రసంగించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరైన కేసీఆర్.. తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇది తెలంగాణ ప్రజల విజయం, ఉద్యమాల విజయం, అమరవీరుల విజయమని కొనియాడారు. 1969 నుండి ఉద్యమం సాగిందని, ఈ దఫా ఉద్యమం గమ్యాన్ని ముద్దాడిందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా, లాయర్లు, ఉద్యోగులు, విద్యార్థులు తెలంగాణ కోసం పోరాడి విజయం సాధించారన్నారు. 1969 నుంచి నేటి వరకు ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అభినందనీయమని అన్నారు. ఉద్యోగుల పాత్రను తెలంగాణ ఎన్నడూ మరిచిపోదన్నారు. తెలంగాణ ఉద్యమం అహింసా మార్గంలో సాగిందని,  ప్రపంచ ఉద్యమాలకే ఆదర్శం గా నిలుస్తుందన్నారు. అమరవీరుల కీర్తి అజరారమరంగా నిలిచి పోతుందన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తామని ప్రజలు ఆశిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజాసమస్యలు తీర్చడంపైనే టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తెలంగాణ ఆశించిన ప్రగతి సాధించాలంటే రాజకీయ అవినీతిని కూకటి వేళ్లనుండి పెకిలించాలన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాంమని హామీ ఇస్తున్నామన్నారు. అవినీతి పరులను కఠినంగా శిక్షిస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగించిన కేసీఆర్ హుందాగా మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగమంతా ఎన్నికల హామీల అమలు గురించే సాగింది. మాట ఇచ్చాం, అమలు చేస్తామన్నారు.

ఎన్నికల హామీల అమలుకు తొలి ప్రాధాన్యం :

 • ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్లు..
 • ఉద్యోగులకు హెల్త్ కార్డులు
 • వేతన ఒప్పదం (పీఆర్సీ) అమలు..
 • ప్రజా సంక్షేమం పెద్ద పీట..
 • దళితులకు, గిరిజనులకు ప్రాధాన్యం..
 • వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయలు పెన్షన్లు,
 • వికలాంగులకు 1500 రూపాయలు.
 • బీడీ కార్మికులకు 1000 రూపాయలు..
 • బలహీన వర్గాలకు గృహనిర్మాణం. రెండు బెడ్ రూంలు, ఒక హాల్, ఒక కిచెన్, 125 గజాల స్థలంలో ఇళ్లు..
 • దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల, మైనారిటీ లకు సంక్షేమం..
 • 5 ఏళ్లలో వీరి సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు
 • దళితుల సంక్షేమనాకే 50  కోట్లు
 • రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ..

వ్యవసాయానికి పెద్ద పీట :

టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులు, వ్యవసాయం వెనకబడిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రంగాన్ని అగ్రగామిగా నిలిచేలా చేస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు లక్ష రూపాయల రుణమాఫీ హామీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విత్తనాలు పండించేందుకు తెలంగాణ ప్రపంచంలోనే అనువైన ప్రాంతమని శాస్త్రవేత్తలు తెలిపారని, వ్యవసాయ పరిశోధనలు పెంచుతామన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞనం అందిస్తామని తెలిపారు. గ్రీన్ హౌజ్ టెక్నాలజీ ని 75 శాతం రాయితీతో అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగ పునరుజ్జీవం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదావరి కృష్ణా నీళ్లతో భూములను తడిపుతామన్నారు. ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు నీరు త్వరలోనే పారిస్తామని హామీ ఇచ్చారు.

పరిశ్రమల కోసం సింగిల్ విండో :

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. దేశంలోనే మూడవ భాగం ఫార్మా, పౌల్ట్రీ పరిశ్రమలున్నాయి తెలంగాణలో ఉన్నాయన్నారు. ఈ రంగాలలో మరింత ఉత్పత్తులను పెంచుతామన్నారు. రియల్ ఎస్టేట్ రంగం 15 నుంచి 20 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నందున తెలగాణ ప్రభుత్వం గుర్తించిందనీ, ఈ రంగ అభిృద్ధి కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలను ఆహ్వానించాలన్నారు. అందుకోసం విద్యుచ్ఛక్తి కావాలని,  రాబోయే మూడేళ్లలో మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పెట్టు బడులను ఆకర్శించేందుకు అత్యంత ఆకర్షణీయమైన పరిశ్రమల పాలసీని ప్రకటిస్తామన్నారు. పరిశ్రమల సింగిల్ విండో ఏర్పాటు చేస్తామన్నారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం :

హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ప్రత్యేకత సాధించిందనీ, బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతామన్నారు. ఇక్కడున్న మురికివాడల స్థానంలో పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు. మురికి వాడలు లేని హైదరాబాద్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసులను ఒకే గొడుగు కిందికి తెస్తాం :

శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందన్నారు కేసీఆర్. మహిళలపై జరిగే దాడులను ఎంత మాత్రం సహించమన్నారు. నేరస్తులెవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయి నిఘా పెంచుతామన్నారు. నగరంలో దాదాపు 600 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసుల్లో ఉన్న వివిధ శాఖలను రద్దు చేసి అందరినీ ఒకే గొడుగు కిందికి తెస్తామని తెలిపారు. అన్ని ఖాళీలను తొందర్లో భర్తీ చేస్తామన్నారు. పోలీసులకు  వారానికొక రోజు సెలవు మంజూరు చేస్తామన్నారు. పాత వాహనాలు స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు సమయం కుదింపు ఉంటుందని,  వైద్య సదుపాయం, మెడికల్ అలొవెన్స్, ఇంక్రిమెంట్లు ఉంటాయన్నారు. పోలీసు ఖర్చులు నెలనెలా ప్రభుత్వం అందిస్తుందన్నారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్ వచ్చిందనీ, శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పోలీసు బిల్డింగు సముదాయం ఏర్పాటు చేస్తామన్నారు.  అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ ప్రసంగాన్ని ముగించారు.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy