సీఎం సీటుపై ఆశలేదు: మంత్రి కేటీఆర్

KTR1ప్రభుత్వ పథకాలు, రాష్ర రాజకీయాలు, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఇలా అన్ని విషయాలపై.. సూటిగా సమాధానాలిచ్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారన్నారు. తనకు సీఎం సీటుపై ఆశలేదని.. వచ్చేసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రని చెప్పారు. మోడీ సర్కార్ తీరును విమర్శించారు. జీహెఎంసీకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని పథకాలు తెచ్చినా.. రైతుబంధు సంతృప్తినిచ్చిందన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ప్రతి విషయంపై స్పందించారు కేటీఆర్.

రాష్ట్రంలో కౌలు రైతులు చాలా తక్కువగా ఉన్నారని.. వాళ్లకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయలేమన్నారు. నేరుగా కౌలు రైతులకు.. రైతుబంధు వర్తింపజేస్తే.. న్యాయ వివాదాలు వచ్చే అవకాశం ఉందన్నారు. పాస్ పుస్తకాల్లో  చిన్నచిన్న తప్పులు ఉన్నాయని.. వాటిని త్వరలో సరిచేస్తామన్నారు. మీడియాతో చిట్ చాట్ చేశారు కేటీఆర్. వందల ఎకరాలు ఉన్నోళ్లకు చెక్కులు ఇస్తున్నారన్న విమర్శలు సరికాదన్నారు. 50 ఎకరాలున్న రైతులు 298 మంది మాత్రమే ఉన్నారన్నారని చెప్పారు. వాళ్లకు ఇస్తున్నది కోటి 30లక్షలేనని వివరించారు. 54 ఎకరాలుంటే సీలింగ్ యాక్ట్ ఉందన్న విషయం గమనించాలన్నారు మంత్రి.

కర్ణాటక రాజకీయాలపై కేటీఆర్ స్పందించారు. యడ్యూరప్పకు కర్ణాటక గవర్నర్ 15 రోజులే టైమిచ్చారని.. ఇంకానయం ఐదేండ్లు నువ్వే సీఎంగా వుండమని చెప్పలేదని కామెంట్ చేశారు. బీజేపీకి, కాంగ్రెస్ కు.. సీఎం కేసీఆర్ కొరకరాని కొయ్యగా తయారైనందునే.. టార్గెట్ చేస్తున్నారన్నారు. ఆయనెవ్వరికీ చిక్కడు దొరకడన్న కేటీఆర్.. దేశ్ కీ నేత కేసీఆరేనన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని.. ఇక్కడ సీఎంగా ఆయనే ఉంటారని చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో నిశబ్ధ విప్లవం అంటున్నారని.. అసెంబ్లీ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు వస్తాయని భయపడింది వాళ్లేనన్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు నిశబ్ధ విప్లవం కనబడుతుందా అని విమర్శించారు. ఉత్తమ్ 2 లక్షల రుణమాఫీ హామీపై స్పందించారు కేటీఆర్. 2 లక్షల రుణమాఫీ ఉన్న రైతులు.. రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఉత్తమ్ కు తెలుసా అని ప్రశ్నించారు. తాము పెట్టుబడి ఇస్తుంటే.. ఇంకా రుణమాఫీ ఏంటో అర్ధం కావటంలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న ఉత్తమ్.. మొదట నిరుద్యోగులంటే ఎవరో క్లారిటీగా చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులను తగ్గించే పనిలో తామున్నామని.. ఉత్తమ్ లాగా పెంచే పనిలో లేమన్నారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండి APPSC ద్వారా 5 వేలు ఉద్యోగాలిస్తే.. తాము నాలుగేళ్లలో TSPSC ద్వారా 30 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఇతర రిక్రూట్ మెంట్ బోర్డుల నుంచి కూడా ఉద్యోగాలిచ్చామన్నారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయన్నారు కేటీఆర్. 2019లో TRS అధికారంలోకి రాకుంటే.. రాజకీయాల్లో ఉండనన్నారు.

కేంద్రంలో మోడీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు కేటీఆర్. డీమానిటైజేషన్ లేకపోతే రాష్ట్రంలో ఇంకా ఆదాయం పెరిగేదన్నారు. మన డబ్బులు మనకిచ్చేందుకు లైన్లో ఉండాలనటమేంటని ప్రశ్నించారు. ఇక GHMCకి ఆపరేషన్ అవసరమన్నారు మంత్రి. ఆ సంగతి తేల్చాల్సి ఉందన్నారు. ఆస్థిత్వాన్ని కాపాడుకునేందుకే ఆర్టీసీ సమ్మె నోటీసులని అభిప్రాయపడ్డారు కేటీఆర్. ఒక సంఘం నోటీస్ ఇచ్చిందని.. మరో సంఘం నోటీస్ ఇస్తాయన్నారు. పార్టీల రాజకీయాలకంటే.. కార్మిక సంఘాల రాజకీయాలే ఎక్కువగా ఉంటాయన్నారు. ఈనెలతో తాను ఎమ్మెల్యేగా పనిచేసి పదేళ్లవుతుందని చెప్పారు కేటీఆర్. ఎన్నో పథకాలు తెచ్చినా.. రైతుబంధు పథకం అన్నింటిలో గొప్పదన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy