సేఫ్ అండ్ థ్రిల్లింగ్ : ‘టాక్సీవాలా’ రివ్యూ

‘టాక్సీవాలా’ రివ్యూ

ఈ టాక్సీ జర్నీ సేఫ్ అండ్ థ్రిల్లింగే…

విజయ్ దేవరకొండ, ప్రియాంక జావల్కర్‌ హీరోహీరోయిన్లుగా మాళవికా నాయర్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. ‘గీతా ఆర్ట్ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ మూవీ జర్నలిస్ట్ ఎస్‌.కె.ఎన్‌ నిర్మించగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. కెరీర్‌లో తొలిసారిగా ఒక సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌‌ మూవీతో ‘టాక్సీవాలా’ గా ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమా విడుదలకు ముందే ఈ టాక్సీకి పైరసీ అనే స్పీడ్ బ్రేకర్ సడన్ బ్రేక్ వేసింది. అయినా స్టీరింగ్ ని కంట్రోల్ చేసుకుని విడుదలయిన ఈ టాక్సీవాలా తనను ఎంత వరకు మంచి డ్రైవర్ అని నిరూపించుకున్నాడో చూద్దాం.
కథేంటి …
మధ్యతరగతి కుటుంబానికి చెందిన శివ (విజయ్ దేవరకొండ)ని అన్న (రవి ప్రకాష్), వదిన (కళ్యాణి)లు పెంచి పెద్ద చేస్తారు. తనని కష్టపడి పెంచిన వాళ్ళకి చేదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వస్తాడు శివ.అక్కడ తన బాబాయ్ (మధు నందన్)ని కలుస్తాడు. అతనొక టాక్సీ గ్యారేజ్ నడుపుతుంటాడు. ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి ఒక యాడ్ చూసి టాక్సీ డ్రైవర్ గా మారాలనుకుంటాడు. అన్న, వదినల సాయంతో ఒక పాత వింటేజ్ కారుని తక్కువ రేటుకి కొనుక్కుని దాన్ని పూర్తిగా మోడరన్ గా తయారు చేసి క్యాబ్ కి పెడతాడు శివ. తొలి కిరాయికి క్యాబ్ ఎక్కిన అనూష (ప్రియాంక జావర్కర్)తో ప్రేమలో పడతాడు. ఇలా హేపీగా ప్రేమ, సంపాదనా రెండు బాగు న్నాయనుకుంటున్న క్రమంలో కారులో జరుగుతోన్న వింత పరిణామాలతో కారులో దెయ్యం ఉందని అర్ధమవుతుంది శివకి. భయంతో కారుని వదిలేద్దామనుకుని కూడా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంపాదించడం అవసరమై మళ్లీ భయంగానే టాక్సీని నడుపుతుంటాడు. అనుకోకుండా ఓ రోజు తన కారు ఎక్కిన డాక్టర్ (ఉత్తేజ్)ని టాక్సీలో ఉన్న దెయ్యం శివ కళ్ల ముందే చంపేస్తుంది. దీంతో తనకు కారు అమ్మిన ఓనర్ ఇంటికి వెళ్లిన శివకు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. చనిపోయిన డాక్టర్ కి, దెయ్యానికి, ఈ ఇంటికి ఏదో లింక్ ఉందని అర్ధమవుతుంది. ఆ కారులో ఉన్నది సిసిర (మాళవికా నాయర్) ఆత్మ అని తెలుసుకుంటాడు. ఇంతకీ శిశిర ఎవరు? ఆమె ఎందుకు ఆత్మగా మారింది. ఆమె కథేంటి, ఆ కారులోనే ఎందుకుంది? ఒక టాక్సీవాలాగా శివ ఆమెకు ఏ విధంగా సహాయపడ్డాడు అనే కారు డ్రైవర్ ఇంటరెస్టింగ్ జర్నీనే మిగతా కథ.
విశ్లేషణ…
‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్’ అనే సైంటిఫిక్ థియరీతో సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్ అనే కొత్త జానర్‌తో తొలి ప్రయత్నంలోనే ప్రయోగం చేశాడు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరం నుండి వేరయి అవి దెయ్యాలుగా మారడం వంటి హారర్ బేస్డ్ మూవీస్ కి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇదే హారర్ కథని సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ థ్రిల్లర్‌ గా కొత్త ప్రయోగం చేసిన దర్శకుడు రాహుల సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి.
సినిమా ఆద్యంతం విజయ్ దేవరకొండ ఒక టాక్సీవాలాగానే కనపడతాడు తప్ప క్రేజున్న హీరోలా కనపడడు . సినిమాలో కీ రోల్ పోషించిన మాళవిక నాయర్‌ పాత్ర సినిమాకి టర్నింగ్ పాయింట్. మధునందన్, జబర్దస్త్ చమ్మక్ చంద్ర, విజయ్ కి రియల్ లైఫ్ ఫ్రెండ్ విష్ణుల కామెడీ బాగుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో , భయపెట్టే సీన్ లు మరీ రొటీన్ గా కాకుండా కొంచెం కొత్త కొత్త కామెడీ టైమింగ్ సీన్ లతో ఫస్టాఫ్ మొత్తం థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గానే సాగుతుంది. అక్కడక్కడా లాజిక్ లు మిస్ అయినా పట్టించుకునేంత స్థాయిలో ఉండవు. సెకండాఫ్ లో శిశిర కథలోకి వెళ్లి, ఎమోషనల్ గా టచ్ చేసి, చివరికి ఏమవుతుందనే ఇంట్రస్ట్ తో సినిమా నడుస్తుంది. ఫన్నీ సీన్స్ కూడా ఇంటరెస్టింగ్ గానే ఉంటాయి. మ్యూజిక్ బాగుంది. కమర్షియర్ హంగులు పెద్దగా లేకపోయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. టోటల్ గా విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ ఒక కొత్త జానర్ లో వెళ్లే సేఫ్ జర్నీ. పైరసీలో చూసినా మళ్ళీ థియేటర్స్‌లో చూడదగిన సినిమానే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy