స్కోరింగ్ సబ్జెక్ట్.. తెలుగుతో బోలెడు మార్కులు

tm-studentsవచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు అంతా రెడీ చేస్తోంది ప్రభుత్వం. తెలుగును స్కోరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా చేయాలనుకుంటోంది. ఇందుకు కావాల్సిన సిలబస్, పుస్తకాలు తయారు చేయాలని నిర్ణయించింది సర్కార్. దీని మీద సబ్ కమిటీ కసరత్తు చేయనుంది.

ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరిచేసేందుకు.. ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో.. తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. తెలుగును ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలుగుభాషను తప్పనిసరి సబ్జెక్టుగా చేయటంపై సెక్రటేరియట్లో.. సబ్ కమిటీ సభ్యులు, విద్యాశాఖ అధికారులతో రివ్యూ చేశారు కడియం. తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో మాతృభాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తున్న విధానంతో పాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల్లో కూడా తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయటంపై ఎలాంటి చర్యలు చేపట్టొచ్చో చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయటంపై.. ఈ సబ్ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి మంత్రికి వివరించింది.

తెలంగాణలో తెలుగు మాతృభాషగా లేని స్కూళ్లు 1,370 ఉన్నాయన్నారు అధికారులు. ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ వరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరి సబ్జెక్టు చేయటంలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశంలేదని కడియంకు చెప్పారు అధికారులు.  ఐదో తరగతి వరకు తెలుగు సబ్జెక్ట్ చదువుకోని వారికి ఆరో తరగతిలో అత్యంత సులభమైన పద్ధతిలో.. సబ్జెక్టును నేర్చుకునే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏడో తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి.. ఎనిమిదో తరగతిలో,  పదో తరగతి వరకు చదువుకోని వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగుభాష ఈజీగాగా నేర్చుకునేలా పుస్తకాలను రూపొందిస్తామన్నారు.

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల్లో కూడా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయటంపై ఉన్నతాధికారులతో మాట్లాడామని, అమలులో తమకెలాంటి అభ్యంతర లేదని చెప్పినట్లు కడియంకు వివరించింది సబ్ కమిటీ. తెలుగును తప్పనిసరిగా అమలు చేసేందుకు పర్యవేక్షణ కమిటీ ఉండాలన్నారు కడియం. ఇందుకోసం ప్రస్తుతం ఏర్పాటైన సబ్ కమిటీని.. తెలుగు భాష అమలు సలహా సంఘంగా మార్చుతున్నట్లు చెప్పారు. ఈ కమిటీ తెలుగును అన్ని విద్యాసంస్థల్లో తప్పనిసరి సబ్జెక్టుగా ఏ విధంగా అమలు చేయాలి, అమలులో వచ్చే ఇబ్బందులను ఎలా అధిగమించాలో.. సూచనలు చేయాలని కమిటీ సభ్యులను కోరారు కడియం. పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ కమిటీలుండాలని, వాటి నిర్మాణం ఎలా ఉండాలో కూడా సబ్ కమిటీ సూచించాలన్నారు.

2018-19 విద్యాసంవత్సరం నుంచి తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని నిర్ణయించడంతో.. అందుకు కావాల్సిన సిలబస్, పుస్తకాలు తయారు చేయాలన్నారు కడియం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy