
హఫీజ్ సయీద్ పై ఉగ్రవాది ముద్ర పడగానే.. పాక్ ఉన్నతాధికారులు కూడా కీలక చర్యలు తీసుకున్నారు. అతనికి చెందిన రాజకీయ పార్టీ జమాత్ ఉద్ దువా పార్టీ ఆఫీసుల ముందు ఉన్న బారికేడ్లను తొలగించారు. హఫీజ్ సయీద్ బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశారు. ఉగ్రవాదిగా ఉన్న హఫీజ్ సయీద్.. పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అవుతున్న టైంలో.. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. అతనికి ఇబ్బందిగా మారనుంది. ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన హఫీజ్ సయీద్ కు.. ఇక ఆ అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
ఐక్యరాజ్యసమితి ఒత్తిడితో.. హఫీజ్ సయీద్ ను.. పాక్ ప్రభుత్వం 297 రోజుల పాటు గృహ నిర్బంధం చేసింది. చివరికి లాహోర్ కోర్ట్ ఆదేశాలతో విడుదల చేసింది. మరోవైపు.. అమెరికా హఫీజ్ సయీద్ ను ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి.. అతనిపై 10 మిలియన్ డాలర్ల వెల కట్టింది. మన దేశం కూడా హఫీజ్ సయీద్ ను ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. చాలా కాలంగా పాక్ పై ఒత్తిడి పెంచుతోంది. భారత్ చేస్తున్న వాదనకు.. ప్రపంచ దేశాల నుంచి మద్దతు కూడా పెరుగుతోంది. దీనికి తోడు.. ఈ మధ్యే ఉగ్రవాదులకు పాక్ సహాయం చేస్తోందన్న కారణంతో అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే.. వచ్చే వారం పారిస్ లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరగనుంది. పాక్ లో ఉగ్రవాద సంస్థలు మనీ లాండరింగ్ ను ప్రోత్సహిస్తున్నాయని.. అమెరికా, భారత్ ఈ సమావేశంలో ఆధారాలతో సహా వాదించనున్నట్టు తెలుస్తోంది. దీంతో.. విధి లేని పరిస్థితుల్లోనే.. తాము ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నామని చెప్పుకునేందుకే.. హఫీజ్ సయీద్ ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది.