హరితహారంతో పర్యావరణాన్ని కాపాడుదాం : కేసీఆర్

KCRఅన్ని సంపదల కంటే ఆరోగ్య సంపదే అత్యంత ప్రాధాన్యమైనదన్నారు సీఎం కేసీఆర్. భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా పెరిగే వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే తెలంగాణాకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నామన్నారు.

మంగళవారం (జూన్-5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. పర్యావరణ ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు సీఎం. ఈ సందర్భంగా పర్యావరణ ప్రేమికులకు, పచ్చదనాన్ని ప్రోత్సహించే వారందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. పర్యావరణ పరంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. పర్యావరణం విషయంలో.. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రభావం మనపైనా ఉంటుందన్నారు సీఎం. వాటి విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీలైనంతగా కాలుష్య కారకాలను వాడకపోవటంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. ప్లాస్లిక్ వినియోగంతో పొంచి ఉన్న ముప్పును ప్రధానంగా ప్రచారం చేస్తోందని చెప్పారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఎంతగా అవసరం ఉన్నా.. దానివల్ల వచ్చే దుష్పరిణామాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన మొదట్లోనే పచ్చదనం, పరిశుభ్రత ప్రాధాన్యతలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు సీఎం. అందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. ప్రజలందరికీ కాలుష్య రహిత వాతావరణం, స్వచ్ఛమైన నీరు, ఆహారం అందించే కర్తవ్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే తెలంగాణకు హరితహారం ప్రారంభమైందని, గత మూడేళ్ల ఫలితాలు స్పష్టంగా కనిసిస్తున్నాయన్నారు. మొక్కల పెంపకం, వాటి రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెంచినప్పుడే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. రానున్న తరాలకు అవసరమయ్యేలా మనం చెట్లు పెంచుతున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు కేసీఆర్.

జూలైలో మొదలయ్యే నాలుగో విడత హరితహారంలో.. అందరూ పాల్గొనటంతో పాటు, నాటిన ప్రతి మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం. పచ్చని పర్యావరణం కోసం హరితహారంలో భాగంగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు, ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు దశలవారీగా ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశ పెట్టబోతున్నామన్నారు. ఇప్పటికే సోలార్ పవర్ లో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు.. సత్ఫలితాలిస్తున్నాయని గుర్తుచేశారు సీఎం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy