హాయి హాయిగా ఆమని సాగే..

ghanta‘అతడు కోట్ల తెలుగుల.. ఎద అంచుల ఊగిన ఉయాల. తీయని గాంధర్వ హేల.. గాయకమణి ఘంటసాల’ అని ప్రశంసిస్తారు సినారే వంటి కవులు. కవి భావానికి తన మధురగానంతో పట్టం కట్టడంలో ఘంటసాల మాష్టారు మహామేటి. సుమారు 50ఏళ్ల పాటూ తెలుగుసినిమా ప్రపంచాన్ని తనదైన గంధర్వరాగంతో ఉర్రూతలూగించాడాయన. ఘంటసాల జయంతి రోజున వీ6 స్పెషల్.

మంద్ర, మధ్యమ, తారా స్థాయి ఏదైనా.. ఏ మాత్రం వన్నె తగ్గకుండా పాట పాడ్డం ఘంటసాల ప్రత్యేకత. పాటలో నటించడమనే ప్రక్రియలో ఆయనకు ఆయనే సాటి. వేల పాటలకు తన గాత్రంతో జీవం పోసి.. వందల పాటలకు తనదైన సంగీతంతో స్వరాలద్దిన సంగీతజ్ఞుడు ఘంటశాల. ఆయన జీవన విశేషాలను వెతుక్కుంటూ వెళ్లడం అంటే, సప్తస్వరాలను పేరు పేరునా పలకరించడమే అవుతుంది.

ఘంటసాల అంటే అది తెలుగు పాటలశాల. ఎన్నో పాటలు ఆయన గళం నుంచి వచ్చి.. సప్తస్వరాలకు అభిషేకం చేసాయి. తెలుగు సినిమా సంగీతంలో సగం పేజీలు తన పేరున రాయించుకున్న వారెవరైనా వున్నారంటే, అది ఖచ్చితంగా ఘంటశాల మాస్టారే. ఆయన తొలినాటి జీవితానికీ పాటల ప్రవాహానికీ ఏమాత్రం పొంతన కుదరదు. ఆయన బాల్యంలో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కున్నారు.

అలాగని చెప్పి అక్కడితో అంతా సాఫిగా జరిగిపోలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. జోలె కట్టి అన్నం అడుక్కోవల్సిన పరిస్థితి. సంపాదించిన అన్నం పెట్టుకోడానికి సరైన గిన్నె కూడా లేక బాధ పడిన రోజులున్నాయి. మొత్తం మీద నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన మ్యూజిక్ కోర్సు.. రెండేళ్లలో పూర్తి చేశారు ఘంటసాల. అక్కడా ఇక్కడా కార్యక్రమాల్లో కచేరీలు చేస్తూ గడపడం అలవాటైంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. 1944వ సంవత్సరం ఘంటసాల  జీవితాన్ని మలుపు తిరిగింది.

కలవరమాయే మదిలో.. అంటూ ఘంటసాల చేసిన గానానికి ప్రేక్షక లోకం ఆయన పాటల ప్రేమలో పడిపోయింది. ఈ సినిమా సంగీతం, సాహిత్యం, గాత్రం.. ఒకదానితో ఒకటి పోటీ పడ్డంతో, ప్రేక్షకలోకం పులకించిపోయింది. ఎక్కడో పాతాళంలో వుండిన ఘంటసాల సినీ జీవితం.. పాతాళభైరవితో ఒక్కసారి ఆకాశపుటంచులు తాకింది.

హిందోళం ఎప్పుడు ఉపయోగించినా అందులో పంచమం పలికించడం ఘంటసాల మాస్టారికి సరదా. హిందూస్తానీ రాగాలను కూడా ఆయన ‘ఇది నాచెలి’ వంటి పాటల్లో ఉపయోగించారు. లలితసంగీతానికి పనికిరావనిపించే రంజని, భైరవి వంటి కర్ణాటక రాగాలను.. కరుణశ్రీ పద్యాల్లో అద్భుతంగా ఉపయోగించారు ఘంటసాల. ఏ రాగం ఎక్కడ వాడినా.. రాగభావాన్ని చెడనివ్వలేదాయన. మాస్టారు పాడితే మాటల్లోని అర్థమూ కనుమరుగయ్యేది కాదు.

తాను ఏ స్థాయికి చేరినా.. సాయం చేసిన చేతులను ఎన్నడూ మరిచి పోలేదు ఘంటసాల మాస్టారు. నాడు కష్టకాలంలో.. అన్నం పెట్టిన అన్నపూర్ణల వల్లే తనకిన్ని ఐశ్వర్యాలొచ్చాయని ఎప్పుడూ భావించేవారాయన. ఉండటానికి నీడ లేక, పానగల్ పార్క్ లో మొదలైన ఘంటసాల స్వరప్రయాణం..  ప్రభుత్వ స్మారక స్టాంప్ విడుదల చేసే వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఆ అమరగాయకుడు మన మధ్య లేకున్నా ఆయన పాడిన పాట ఇప్పటికీ వీనుల విందు చేస్తూనే ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.