హార్వే తుపాను: నిండా మునిగిన హూస్టర్..10మంది మృతి

HARVEYహార్వే తుపాన్ ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చరిత్రలోనే అత్యంత విధ్వంసకర తుపానులలో ఒకటిగా చెబుతున్న ఈ తుపాను ధాటికి పది మంది మరణించారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఆస్తినష్టం సంభవించింది. తుపాను ప్రభావంతో సంభవించిన వరద ముంపులో చిక్కుకున్న వారని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. వర్షం తెరిపిస్తే తప్ప ముంపు ప్రాంతాలలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

అమెరికా చరిత్రలోనే అత్యంత విధ్వంసకర తుపానుల్లో ఒకటిగా నిలుస్తున్న హార్వే… టెక్సాస్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. హార్వీ తుపాను సంబంధిత కారణాలతో ఇప్పటికే 10 మంది మరణించారు. ఓ వ్యాన్‌ వరదలో మునిగిపోవడంతో అందులోని ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు చిన్నారులున్నారు.

అమెరికాలో నాలుగవ అతిపెద్దది, టెక్సాస్‌లో అత్యంత ఎక్కువ జనాభా నివసించే నగరమైన హూస్టన్‌కు హార్వే తుపానుతో బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లిందనీ… కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని అధికారులు చెప్పారు. హూస్టన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రహదారులు కొట్టుకుపోవడంతో అంబులెన్సులు మెడికల్ కాలేజీలకు చేరుకోడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

తుఫాను ప్రభావం టెక్సాస్‌ వ్యాప్తంగా దాదాపు 1.3 కోట్ల మందిపై ఉంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 12 వేల మంది సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 16 హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెక్సాస్‌లోని తూర్పు కౌంటీల్లో రానున్న రోజుల్లో ప్రాంతాన్ని బట్టి 15 నుంచి 24 అంగుళాల (38 నుంచి 60 సెంటీ మీటర్లు) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం తెలిపింది. వర్షం తెరపిస్తే మరో 30 వేల మందిని వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అధికారులు చెప్పారు. టెక్సాస్‌లో విద్యుత్తు సరఫరా లైన్లను ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు.

గత శుక్రవారం (ఆగస్టు25) హార్వే తుపాను గంటకు దాదాపు 130 మైళ్ల వేగంతో తీరాన్ని తాకింది. అప్పటి నుంచి తుపాను మరింత విజృంభిస్తోంది. టెక్సాస్‌–లూజియానా సరిహద్దులో తుపాను బుధవారం (ఆగస్టు30) ఉదయం మరోసారి తీరాన్ని తాకే అవకాశం ఉందని CNN వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ప్రజలు తమ దీనస్థితిని తెలుపుతూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి సహాయం కోసం అర్థిస్తున్నారు.

బ్య్రాన్‌ సరస్సులో మునిగి దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు భారతీయ విద్యార్థులను సహాయక సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారిని టెక్సాస్‌లోని ఏ అండ్‌ ఎం వర్శిటీలో చదువుతున్న నిఖిల్‌ భాటియా, షాలినిగా గుర్తించారు. వారు ఈత కొట్టేందుకు సరస్సు దగ్గరకు వెళ్లినట్లు భావిస్తున్నారు. మరోవైపు హూస్టన్‌ చుట్టుపక్కల నివసిస్తున్న దాదాపు లక్ష మంది భారతీయ అమెరికన్లపై కూడా తుపాను ప్రభావం భారీగా ఉంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించా రు. 200 మందికిపైగా ఇండియన్ స్టూడెంట్స్ ఇళ్లలో చిక్కుకుపోగా వారికి భారత కాన్సులేట్‌ సహాయం అందిస్తోంది. భారతీయుల సహాయం కోసం ఓ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను కూడా హూస్టన్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ అనుపమ్‌ రే ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy