హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్

ఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా అవినీతి వ్యవహారంలో అరెస్టయిన ఆ సంస్థ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుంది.

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా అవినీతి వ్యవహారంలో ఆ సంస్థ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది. ఆదివారం రాత్రి ఆయన కార్యాలయంలో, నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్ లు, మొబైల్‌ ఫోన్లు, ఐపాడ్లను సీజ్ చేశారు.

మాంసం ఎగుమతుల వ్యాపారి మొయిన్‌ ఖురేషికి సంబంధించిన కేసులో గతంలో దేవేందర్ కుమార్ దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. కేసు నుంచి విముక్తి పొందడానికి లంచాలు సమర్పించానంటూ ఆరోపించిన హైదరాబాద్‌ వ్యాపారి సానా సతీశ్‌ బాబు వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో… కుమార్‌ ఫోర్జరీకి పాల్పడినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. సెప్టెంబరు 26న సతీశ్‌ వాంగ్మూలాన్ని ఆస్థానా ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం నమోదు చేసినట్లు చెబుతున్నా… నిజానికి ఆ తేదీన ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఆ మేరకు హోటల్‌ బిల్లులు, ఇతర ఆధారాలను సంస్థ సేకరించింది.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ రూ.2 కోట్ల లంచాన్ని సానా సతీష్ బాబు నుంచి తీసుకున్నారంటూ ఆస్థానా ఈ ఏడాది ఆగస్టులో ఆరోపించారు. ఆ ఆరోపణల్ని బలపరిచే రీతిలో వాంగ్మూలాన్ని కుమార్‌ సృష్టించారని సీబీఐ ఆరోపిస్తోంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy