హైకోర్టు సంచలన తీర్పు : పెళ్లి పేరుతో మోసం చేస్తే ఇక అంతే..

RAPE BEFORE MARRIAGEమహిళలు మగాడి ఆట వస్తువులు కాదు.. మగాడి ఆధిపత్యం చూపించటానికి, మోసం చేయటానికి వాళ్లేమీ బానిసలు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భోపాల్‌ కు చెందిన రాజీవ్ శర్మ, ఓ నృత్య కళాకారిణితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆరు నెలలు కలిసి తిరిగారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే తల్లి వ్యతిరేకించడంతో రాజీవ్ వెనక్కి తగ్గాడు. పెళ్లికి నిరాకరించాడు.

పెళ్లి పేరుతో మోసం చేశాడని.. శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. లైంగికదాడిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. 2017 మార్చిలో రాజీవ్‌ ను అరెస్టు చేశారు. కేసులో నమోదు చేసిన సెక్షన్లపై హైకోర్టుకి వెళ్లాడు రాజీవ్. ఇద్దరి అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని, అది అత్యాచారం కిందకు ఎలా వస్తుందని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై ఆసక్తికరంగా సాగిన వాదనల తర్వాత న్యాయమూర్తి సుశీల్‌కుమార్ పాలో సంచలన తీర్పు ఇచ్చారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించినందు వల్లే ఆమె శృంగారానికి సిద్ధమై ఉండొచ్చు.. అలాంటప్పుడు దానిని మనస్ఫూర్తిగా ఇచ్చిన అంగీకారంగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. శృంగారం కోసమే నిందితుడు (రాజీవ్‌శర్మ) యువతిని పెళ్లి ప్రతిపాదన చేసినట్లుగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి హామీ ఇవ్వబట్టే ఆ మహిళ శృంగారానికి అంగీకరించినట్లు భావించాలి.. ఆ తర్వాత కూడా పెళ్ళి జరగలేదు.. స్త్రీ శరీరం మగాడి ఆట వస్తువు కాదు. మహిళ సమ్మతించేలా ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి చేసి శృంగారానికి పాల్పడడం నీచమైన చర్య. అందుకు నిందితుడు తగిన శిక్ష అనుభవించాల్సిందే అని తీర్పు చెప్పారు న్యాయమూర్తి. పెళ్లి పేరుతో మోసం చేస్తే అత్యాచారం కిందే పరిగణించాల్సి వస్తుందని తీర్పు ఇచ్చారు జడ్జి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy