హైదరాబాద్ అడ్డా: జోరుగా నకిలీ విత్తనాల దందా

fake-seedsహైదరాబాద్ సెంటర్ గా సాగుతున్న నకిలీ విత్తనాల దందా జోరుకు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. గుజరాత్‌లో తయారవుతున్న ఈ విత్తనాలను హైదరాబాద్‌ నుంచి మూడు జిల్లాల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. డిస్ట్రిబ్యూషన్‌ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం (జులై6) తెలిపారు. ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నా మన్నారు.
రాజస్తాన్‌కు చెందిన భరత్‌ పటేల్‌ సికింద్రాబాద్‌లోని హైదర్‌బస్తీలో ‘మహావీర్‌ ట్రేడర్స్‌’ పేరుతో సంస్థ ఏర్పాటు చేశాడు. 6 నెలలుగా గుజరాత్‌ నుంచి ‘కావ్య’ బ్రాండ్‌ పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను తీసుకొస్తున్నాడు. గాంధీనగర్‌ బన్సీలాల్‌పేటలో ఓ గోదాము ఏర్పాటు చేసి.. గుజరాత్‌కు చెందిన పటేల్‌ అమిత్‌కుమార్‌ చంద్రకాంత్, హార్ధిక్‌ పటేల్, వినయ్‌ ఆర్‌.షాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. వ్యవసాయ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోకుండా ‘కావ్య’ బ్రాండ్‌ పత్తి విత్తనాలను కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్‌ జిల్లాల్లోని షాపుల ద్వారా రైతులకు అమ్ముతున్నారు.

450 గ్రాముల బరువుతో ఉన్న ఆకర్షణీయమైన ప్యాకెట్లు, విడిగా కేజీల లెక్కన విత్తనాలు అమ్ముతున్నారు. ఈ ప్యాకెట్లపై ధర, తయారీ తేదీ తదితర వివరాలేవీ లేవు. ప్రభుత్వ సబ్సిడీ పత్తి విత్తనాల ధర 450 గ్రాములు రూ.800 వరకు ఉండగా.. రూ.200 నుంచి రూ.250కు అమ్ము తున్నారు.

నకిలీ విత్తనాల అమ్మకాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.బల్వంతయ్య టీం వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి దాడి చేసి భరత్‌ పటేల్‌ మినహా మిగిలిన ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులనుంచి రూ.20 లక్షల విలువైన 1,250 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డినగర్‌లో వివిధ రకాల నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఎంఈ శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన శివారెడ్డి…BN రెడ్డినగర్,SKT నగర్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని వివిధ కంపెనీలకు చెందిన కూరగాయలు, పత్తి తదితర విత్తనాలను అనుమతి లేకుండా మిక్సింగ్, ప్రాసెసింగ్‌ చేస్తూ విక్రయిస్తున్నాడు.

పక్కా సమాచారంతో గురు వారం అతడిని అరెస్టు చేసి, రూ.27.86 లక్షల విలువైన నకిలీ విత్తనాల బ్యాగ్‌లు, మిక్సింగ్, ప్రాసెసింగ్‌ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి నట్టు చెప్పారు. గత నెలలో అత్తాపూర్‌ ఏజీ కాలనీలో అగ్రిబయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో దందా నిర్వహిస్తున్న శివారెడ్డిని శంషా బాద్‌ పోలీసులు అరెస్టు చేశారని, బయటకొచ్చిన తరువాత మకాం మార్చి మళ్లీ నకిలీ విత్తనాల వ్యాపారం మొదలుపెట్టాడని తెలిపారు.

కల్తీ దినుసుల ముఠా గుట్టురట్టు అయింది. కారం, ధాన్యాలు, పసుపు, ధనియాలు, లవంగాలు, మసాలా పొడులు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ ఉప్పుగూడ హను మాన్‌నగర్‌కు చెందిన ఈదులకంటి పాండుగౌడ్‌ (47) ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి సాగర్‌ హైవే సమీపంలో శ్రీ భవాని ఏజెన్సీ పేరుతో గోదామును ఏర్పాటు చేశాడు.

దీనిలో హయత్‌ నగర్‌ మండలం యంజాల్‌కు చెందిన తుమ్మిడి నర్సిరెడ్డి (38), బాలాపూర్‌ మండలం జిల్లెలగూ డకు చెందిన నిమ్మల నారాయణ సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. ముగ్గురు కలసి పాడైపోయిన ఎండు మిర్చి, గడువు ముగిసిన వస్తువులతో కల్తీ కారం తయారు చేస్తున్నారు. కారంతోపాటు కల్తీ పసుపు, ఆవాలపొడి, యాలకులు, ధనియాల పొడి తయారు చేసి శ్రీఓం, చక్రం బ్రాండ్ల పేరిట ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ చేస్తున్నారు. వీటి తయారీలో తక్కువ ధర ఆయిల్‌ను ఉపయోగిస్తున్నారు.

గోదాంపై స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారి విజయ్‌కుమార్‌ దాడి చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 4 టన్నుల మిర్చి, 3.5 టన్నుల పసుపు, 1,250 కిలోల దనియాలు, 300 కిలోల ఆవాల పొడులు, 2,500 కిలోల పొట్టు, 15 లీటర్ల నాసిరకమైన నూనె, మిర్యాల పొట్టు, లవంగా ఆకు వంటి రూ.కోటి  విలువైన దినుసులను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy