హైదరాబాద్ రోడ్లకు కొత్త రూపు: సీఎం

kcr-roadsహైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. చిన్నపాటి వానలకే రోడ్లు పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు సీఎం. రోడ్లపై గుంతలు పడటంతో ట్రాఫిక్ జాం అవుతోందన్నారు. గత పాలకులు వ్యూహాత్మకగా వ్యవహరించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు సీఎం. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా రోడ్ల అభివృద్ధి జరగలేదన్నారు.

హైదరాబాద్ లో కరెంటు, టెలిఫోన్ లైన్ల కోసం, డ్రైనేజీ మరమ్మతుల కోసం, మంచినీటి పైపులు వేయడానికి నిత్యం రోడ్లను తవ్వేస్తున్నారని, ఇది కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రధాన కారణమవుతోందన్నారు సీఎం కేసీఆర్. ఇలాంటి సమస్యలు రాకుండా రోడ్ల నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. రహదారులను బాగా వెడల్పు చేయాలని, నాలుగు లైన్లు, ఆరు లైన్ల రోడ్లు నిర్మించాలని, ప్రత్యేకంగా ఫుట్ పాత్ లు నిర్మించాలన్నారు. దీనికోసం సమగ్ర అధ్యయనం అవసరమన్నారు సీఎం. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో అనుసరించే పద్దతులను అధ్యయనం చేయాలన్నారు. మొదటి దశలో చేపట్టే వంద కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మూసీ నదికి రెండు వైపులా రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్ల మాదిరిగానే నగరం చుట్టూ మరికొన్ని బస్ టర్మినల్స్ కూడా నిర్మించాలన్నారు. పార్కింగ్ కష్టాలను తొలగించేందుకు చేపట్టిన మల్టీ ఫ్లోర్ పార్కింగ్ వ్యవస్థల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. మెట్రో రైలు పనులు జరిగే రహదారులను పట్టించుకోవడం లేదని, అక్కడ కూడా రహదారులను ఎప్పటికప్పుడు తీర్చిదిద్దాలని, అవసరమైన మరమ్మతులు చేయాలని సూచించారు సీఎం.

ప్రస్తుతం హైదరాబాద్ నగర రోడ్ల పరిస్థితిని, ట్రాఫిక్ జామ్ లను చూసి రాష్ట్రంలోని ఇతర నగరాలు జాగ్రత్త పడాలని సూచించారు సీఎం. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి నగరాలు త్వరలో బాగా విస్తరించే అవకాశం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే రహదారుల వ్యవస్థను మెరుగుపరచాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy