హైదరాబాద్ లో ఐసిస్ కలకలం.. ఇద్దరు అరెస్టు

హైదరాబాద్ లో మరోసారి ఐసిస్ మూలాలు బయటపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసీస్ లో చేరేందుకు యువకులు మొగ్గుచూపుతున్నట్లు NIA ఆధారాలు సేకరించింది. వారం రోజులు హైదరాబాద్ లో మకాంవేసిన NIA అధికారులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఉగ్రవాది అద్నాన్ హసన్ తో సంబంధాలు కొనసాగిస్తూ.. ఐసిస్ సిద్ధాంతాలను హైదరాబాద్ లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను NIA అధికారులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ ఉగ్రవాదుల అనుచరులతో.. యువకులు మాట్లాడినట్లు ఆధారాలు సేకరించారు. పక్కా సమాచారంతో.. హైదరాబాద్ హఫీజ్ బాబా నగర్ కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ బాసిత్, చాంద్రాయనగుట్టకు చెందిన 19 ఏళ్ల మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ లను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు ఐసిస్ ఐడియాలజీకి ఆకర్షితులై.. దేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని బయటపడింది.

బోధ్ గయ పేలుళ్ల కేసులో 2016 జనవరిలో ఐసిస్ ఉగ్రవాదులు షేక్ అజహరుల్ ఇస్లామ్, మహమ్మద్ ఫర్హాన్ షేక్, అద్నాన్ హసన్ లను అరెస్ట్ చేసింది NIA. ముస్లిం యువకులే టార్గెట్ గా.. వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి ఐసిస్ లో రిక్రూట్ చేస్తున్నారని అభియోగాలు మోపింది. 2016 జులై 25న ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ పాటియాలా హౌస్ స్పెషల్ కోర్టు షేక్ అజహరుల్ ఇస్లామ్, మహమ్మద్ ఫర్హాన్ షేక్ లకు ఏడేళ్ల జైలుశిక్ష వేసింది. మరో ఉగ్రవాది అద్నాన్ హసన్ ట్రయల్ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరుగుతున్న క్రమంలోనే.. అద్నాన్ హసన్ తో టచ్ లో ఉన్న.. హైదరాబాదీ యువకుడు అబ్దుల్ బాసిత్.. హాసన్ అనుచరులతో ఎప్పుడూ టచ్ లో ఉంటున్నట్లు NIA దృష్టికి వచ్చింది. రంగంలోకి దిగిన NIA అధికారులు అబ్దుల్ బాసిత్ పై నిఘాపెట్టారు.

ఆరో తేదీన హైదరాబాద్ వచ్చిన NIA అధికారులు.. ఏడుగురు యువకుల ఇళ్లలో సోదాలు చేశారు. సోదాల్లో ఉగ్రవాద సంస్థల ప్రతినిధులతో యువకులకు లింకులున్నట్లు ఆధారాలు సేకరించారు. దాదాపు 20 మంది యువకులను బేగంపేట NIA ఆఫీసులో విచారణ జరిపారు. అబ్దుల్ బాసిత్ ఇంట్లో జరిపిన సోదాల్లో అబ్దుల్ ఖదీర్ తోపాటు మరికొందరు యువకులు.. ఐసిస్ ఆపరేషన్లకు పనిచేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఢిల్లీ, కర్ణాటక నుంచి వచ్చిన NIA అధికారులు.. నాలుగు రోజులపాటు విచారణ జరిపారు. విచారణలో అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖదీర్ లు ఐసిస్ కు పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy