
యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో టోల్ గేట్ల దగ్గర సంక్రాంతి రష్ పెరిగింది. ఇవాళ్టి నుంచి పండుగ సెలవులు కావడంతో.. సొంత వాహనాల్లో పల్లెటూర్లకు బయల్దేరారు పట్నం ప్రజలు. సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో.. పంతంగి.. కొర్లపహాడ్.. కీసర.. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. హైదరాబాద్ – విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఒక్కో టోల్ గేట్ దాటేందుకు అరగంటకు పైనే పడుతోందంటున్నారు వాహనదారులు.
రద్దీ పెరగడంతో స్థానిక పోలీసులు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఐదుగంటల వ్యవధిలో ఒక్క కీసర టోల్ ప్లాజా వద్ద ఆరువేల వాహనాలు వచ్చినట్లు టోల్‌ప్లాజా ప్రతినిధులు తెలిపారు. రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు.