హ్యాపీ బర్త్‌డే సీఎం సార్‌

kcr-birthdayఆ గర్జన తెలంగాణను యుద్ధభూమిలా మలిచింది. ఆయన నినాదం రణన్నినాదమై మోగింది. తెలంగాణ ప్రజల నరనరానా ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రగిలించింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టింది. అరవై ఏళ్ల కల సాకారమయ్యేలా చేసింది. ఉద్యమమే కాదు.. అభివృద్ధిలోనూ రాష్ట్రాన్ని ప్రపంచంలో ది బెస్ట్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ బర్త్ డే ఇవాళ.

తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17 న మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించారు. సొంత జిల్లాలోనే ప్రాథమిక, ఉన్నత విద్య పూర్తిచేసిన కేసీఆర్.. చిన్నప్పటినుంచే సాహిత్యం, భాష, రాజకీయ అంశాలపై ఆసక్తి చూపించారు. హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో లిటరేచర్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓ కార్యకర్తగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన ఆయన.. తర్వాత ఎన్టీ రామారావు స్ఫూర్తితో తెలుగుదేశంలో చేరారు. 1983లో మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1989, 94, 99, 2001,2004 ఎన్నికలతో కలిపి.. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేసీఆర్. ఎన్టీఆర్ హయాంలో 1987-88లో కరువు శాఖమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ రావు.. చంద్రబాబు పాలనలోనూ.. 1996లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  2000-2001 మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 లో డిప్యూటీ స్పీకర్ పదవిని, టీడీపీ సభ్యత్వాన్ని వదులుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రసమితిని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టున్న కేసీఆర్.. తన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకుని ప్రత్యేక రాష్ట్ర స్పూర్తిని రగలించారు.  2004 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా.. సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడంతో.. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా కేసీఆర్ పనిచేశారు. తెలంగాణకు యూపీఏ అనుకూలంగా లేదంటూ కూటమినుంచి బయటికొచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 లో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించిన కేసీఆర్..  2014 సాధారణ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ శాసనసభ్యుడిగా గెలిచారు.

2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన నిరవధిక దీక్షతో రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు కేసీఆర్. మేధావులు, ప్రజల సహకారంతో.. తనదైన వ్యూహాలతో.. ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. తెలంగాణ ఏర్పాటు చేయించడంలో సక్సెస్ అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అఖండ విజయం సాధించి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగారు తెలంగాణ నినాదంతో… ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుని.. సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ మరోసారి దేశాన్ని ఆకట్టుకుంటున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రుణమాఫీ వంటి పథకాలతో జనం మన్ననలు పొందుతున్నారు కేసీఆర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy