హ్యాపీ బర్త్ డే: పాటల పాఠశాల ఘంటసాల

ghantasala-venkateswarraoఆ స్వరం పాటకు ప్రాణం పోస్తుంది. గోదావరి తీరంపై నురుగుల ప్రవాహంలా పదాలను పరుగులు పెడుతుంది. అలసిన మనసును సేదతీరుస్తుంది. వెన్నెల్లో జోలపాడుతుంది. ముద్దుచేస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. కోటి వీణియలను తనలోనే దాచుకుని తుమ్మెద నాదమై మన చెవిని చేరుతుంది. వేణువులోకి దూరే పిల్లగాలులోలె సవ్వడి చేస్తుంది. ఉషోదయ సుప్రభాతమై నిద్రలేపుతుంది. భానుడి రవికిరణమై నులివెచ్చగా మదిని తాకుతుంది. తెలుగు సినిమా చరిత్రలో ఆణిముత్యాలన్నీ ఆ గొంతుక నుంచి జాలువారినవే. తన పాటను ప్రతినోట పలికించి కంఠశాలగా నిలిచారు గందర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు.

తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో స్వరసామ్రాట్ గా నిలిచారు ఘంటసాల. ఎన్ని పాటలు విన్నా శ్రోతల దాహం తీరదు. భక్తిరసాత్మకమైనా, జానపదమైనా, సాంఘీకమైనా పాట ఏదైనా సరే.. దానికి ఆయన గొంతుక తోడైతే అలా నిలిచిపోవాల్సిందే. అదీ ఘంటసాల వాయిస్ కున్న ప్రత్యేకత. ఆ మాధుర్యం ఆయనకు మాత్రమే సొంతం.

1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో జన్మించారు ఘంటసాల. ఆయన నాన్నగారు నాటకాలలో మృదంగం వాయిస్తూ, భజనలు చేస్తూ ఉండేవారు. తండ్రి నుంచే సంగీతంపై ఆసక్తి కలిగింది. 11వ ఏటే తండ్రి చనిపోయారు. ఆయన కిచ్చిన మాటకోసం సంగీత విధ్వాంసుడవ్వాలన్న పట్టుదలతో ఎన్నో కష్టాలకోర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమలతో తనకంటూ ఓ స్థానం కల్పించుకున్నారు.

ప్రముఖ సినీగేయ రచయిత సముద్రాలతో స్నేహం ఘంటసాల కెరీర్ ను మలుపుతిప్పింది. ఓ ప్రముఖ రికార్డింగ్ కంపెనీకి ఘంటసాలను పరిచయం చేశారాయన. సీతారామజననంలో కోరస్ పాడే అవకాశం దొరికింది. ఆ తర్వాత ఛాన్స్ వచ్చినప్పుడల్లా సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేసుకుంటూ గడిపారు. స్వర్గసీమ సినిమాకు తొలిసారి ప్లేబ్యాక్ సింగర్ అవకాశం దక్కింది.

పాతాళభైరవి సినిమాతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమోగింది. ఘంటసాల గాత్ర మాధుర్యం సినిమాను ప్రజలకు దగ్గర చేసింది. ఆ తర్వాత మల్లీశ్వరి, దేవదాసు, అనార్కలి చిత్రాల్లోని పాటలు మైల్ స్టోన్ గా నిలిచాయి. 1957లో రిలీజైన మాయాబజార్ పాటలు ఇక చెప్పాల్సిన పనిలేదు., లవకుశ, పాండవ వనవాసం, రహస్యం, గుండమ్మ కథ, పరమానంద శిష్యుల కథ.  ఇలా 1950 నుంచి 1960 వరకు ఘంటసాల  సంగీత ప్రభంజనం కొనసాగింది .

వాయిస్ ఛేంజ్ చేసి పాడటంలో దిట్ట ఘంటసాల. సాంగ్ సిచ్యువేషన్ ను బట్టి హీరో వాయిస్ కి దగ్గరగా పాడటం ఆయన స్పెషాలిటి. అందుకే ఏ హీరోకి పాడినా .. వాయిస్ లో క్లారిటీ మాత్రం మిస్సయ్యేది కాదు. తెరపై హీరోనే పాడుతున్నట్టు అనిపించేది. ఒక్క గొంతుకతోనే ఎన్నో మ్యాజిక్ లు చేసేవారు.

జగదేక వీరుని కథ చిత్రం కోసం కంపోజ్  చేసిన ‘శివశంకరీ శివానంద లహరి..” ప్రపంచంలో సంగీత ప్రేమకులందర్నీ అలరించిన పాట. సింగిల్  టేక్ లో పాడి రికార్డు సృష్టించాడు. కన్నడ సంగీతంతో పాటు హిందూస్థానీ, కర్ణాటక క్లాసికల్  శైలిలో అనితర సాధ్యంగా కంపోజ్  చేయబడిన పాటను ఘంటసాల పాడిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో తెలుగు, తమిళ పాటలు కలిసి 13వేలకు పైగా పాటలు పాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేరకు ఆస్థాన గాయకునిగా అనేక భక్తి గీతాలు ఆలపించారు. దేశ భక్తి గీతాలు, పద్యాలు, భగవద్గీతకు స్వయంగా రచించి జీవం పోశారు. పుష్పవిలాపం, కుంతి విలాపం, ఎంకినాయుడు బావ, గుత్తివంకాయ కూర, పోలీసు వేంకటసామి గీతాలు ఆపాత మధురాలు వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు.

స్వరసామ్రాట్ గా తెలుగు సినీ పరిశ్రమలను ఏలుతున్నా అనారోగ్యం ఆయన్ను వేధిస్తూ ఉండేది. అయినా పాటలు పాడటం మాత్రం ఆపేవారు కాదు. భగవద్గీత తర్వాత పాటలకు స్వస్తి చెప్పాలనుకున్నా.. పట్టుబట్టి మరి ఆయనో పాడించుకునేవారు సినీ దర్శకులు. ఆ వాయిస్ తమ సినిమాలో లేకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు భావించే వారు.

1970లో గందర్వగానానికి పద్మశ్రీ ఇచ్చింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. తెలుగుసినీ పరిశ్రమకు ఆయన సేవలకు గాను పోస్టల్ స్టాంపును రిలీజ్ చేసింది. అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 11న సంగీత ప్రియులను దుఖ:సాగరంలో ముంచేసి శెలవంటూ వెళ్లిపోయారు ఘంటసాల.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy