హ్యాపీ బర్త్ డే సచిన్: మాస్టర్ బ్లాస్టర్ కు 45 ఏళ్లు

sachinలిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్, కింగ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ ఆఫ్ రికార్డ్స్ మీరు ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. పొగిడితే పొంగిపోడు. విమర్శిస్తే ప్రతివిమర్శచేయ చేయడు. టాలెంట్ ని నమ్ముకుని వచ్చినవాడు.. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ రమేష్ టెండూల్కర్ కు ఇవాళ్టీతో (మంగళవారం,ఏప్రిల్-24) 45 ఏళ్లు. క్రికెట్ చరిత్ర పుస్తకంలో రికార్డులన్నీ ఈ ఆటగాడి ముందు తలవంచాయి. టెస్టులో 51 సెంచరీలు.. వన్డేల్లో 49 సెంచరీలు సాధించి… ఎవరికి అందనంత ఎత్తున్న శిఖరాగ్రాన నిలిచాడు.

ప్రపంచ దేశాలకు ఇండియా అనగానే ఠక్కున గుర్తొస్తాడు సచిన్ టెండూల్కర్. మైదానంలో ప్రతిభతో భారత ఖ్యాతిని ఎల్లలు దాటించిన ధీరుడు మాస్టర్. కానీ భారత్ లో క్రికెట్ ఓ ఆట కాదు…అదే సచిన్ అదృష్టం… దురదృష్టం కూడా… ఇక్కడ క్రికెట్ ఆట మతమైంది… మాస్టర్ దేవుడయ్యాడు…దేవుడి బ్యాట్ నుంచి ప్రతీసారి సెంచరీ ఆశించారు  అభిమానులు…దీంతో క్రికెట్ లో ఏ ఆటగాడైన 40 కంటే ఎక్కువ పరుగులు చేస్తే రాణించాడంటారు…కానీ సచిన్ ఓ హాఫ్ సెంచరీ సాధించినా అభిమానులకు అసంతృప్తే… సెంచరీలను మంచినీళ్ల ప్రాయంలో కొట్టిన అతని బ్యాట్ నుంచి ప్రతీసారి సెంచరీనే కోరుకునే వారు ఫ్యాన్స్. అంతే కాదు ఆ పరుగుల వీరుడిని ఇప్పటికే…ఎప్పటికి గుండెల్లో పెట్టుకున్నారు.

24 ఏళ్ల కెరీర్లో సచిన్ సాధించనిదంటూ ఏదీలేదు. ప్రతీ క్రికెటర్ కలలోనే ఊహించుకునే రికార్డులను సాధ్యం చేశాడు. బుడతడు గ్రౌండ్ లో దిగితే ప్రత్యర్థులకు మూడిందే.. సెంచరీ చేసికాని క్రీజ్ ని వదిలేవాడు కాదు. సచిన్ ను అభిమానించేవారు అతడి భక్తులుగా మారిపోయారు. ఆటతోనే వారితో మాట్లాడాడు. ఆటతోనే వరాలిచ్చాడు. ఆటతోనే కోరికలను తీర్చాడు. అతడి ఆటే వారికి ప్రాణం.. అతడే వారి దేవుడు. అందుకే సచిన్ ను గాడ్ ఆఫ్ క్రికెట్ అని ప్రపంచమంతా అంటోంది.

మాస్టర్ సెంచరీ చేయని దేశం లేదు. అతడు సాధించని విజయాలు లేవు. అతడు సాధించని రికార్డులులేవు. తన తర్వాత వచ్చే క్రికెటర్లకు ఈ రికార్డులు బద్దలు కొట్టండంటూ కొన్ని గణాంకాలు నమోదు చేశాడు. ఎంతో మంది బౌలర్లకు లైఫ్ లేకుండా చేశాడు. అదంతా అతడి మానియా కాదు.. అది మాస్టర్ ఘనత. ఒకటో సెంచరీ చేసిన రోజున సచిన్ లో ఎలాంటి అణకువ ఎలాంటి తపన కనిపించిందో.. వందో సెంచరీ పూర్తిచేసిన రోజునా.. అదే సచిన్ కనపడ్డాడు.

సచిన్ గ్రౌండ్ లోనే కాదు…బయట కూడా వివాదరహితుడిగా అందరి మన్ననలు పొందాడు. భారతీయులే కాదు ప్రపంచంలోని ప్రతి క్రీడాభిమాని సచిన్ వ్యక్తిత్వాన్ని అభినందిస్తాడు..ఆరాధిస్తాడు. కెరీర్  ప్రారంభం కాగానే వక్తిగత దూషణలు చేస్తున్న మన యువ క్రికెటర్లకు ఏనాడూ హద్దు దాటి ప్రవర్తించని సచిన్ స్పూర్తి కావాలి.. పాతికేళ్ల కెరీర్ లో  విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానమిచ్చారు మాస్టర్.

ఏ క్రీడాకారుడు పొందని భారతరత్నను అందుకున్నాడు సచ్చిన్. అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కు ప్రత్యేక్షంగా రిటైర్ మెంట్ ప్రకటించినా….టీమిండియాకు ….ఐపీఎల్ కు తన సేవలను కొనసాగిస్తున్నాడు. మరోవైపు రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రజా సేవను కంటిన్యూ చేస్తున్నాడు. ఇవాళ 45వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సచిన్ కు దేశవ్యాప్తంగా ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy