పాటల పూదోటలో రారాజు

ghantasalaతెలుగు పాట అనగానే గుర్తుకువచ్చే మొదట పేరు ఘంటసాల. మూడు తరాల పాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్నీ తన కమనీయ కంఠ మాధుర్యంలో ఓలలాడించిన గాయకుడు ఘంటసాల. గొంతులో అమృతం నింపుకుని పాటలు పాడుతున్నారా అనే అనుభూతికి లోను జేసే ఒకే ఒక గొంతు ఘంటసాల గొంతు. పాటలో లీనమయి…. పాటే ప్రాణమయి జీవించిన అమరగాయకుడు ఘంటసాల.కళలకు నిలయమైన విజయనగరం జిల్లాలో సంగీత విద్యనభ్యసించిన ఘంటసాల జీవితం తెరచిన పుస్తకం. నేపథ్య గాయకులలో ఘటంసాలను మించినవారు లేరు….. ఇక రారు అని ఘంటాపథంగా చెప్పవచ్చును. ఘంటసాల గురించి చెప్పడానికి తెలుగులో ఉన్న విశేషణాలు, పొగడ్తలు అన్నీ కలిపినా సరిపోవనిపిస్తుంది. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతనాన్ని తన తీయటి కంఠంతో ప్రపంచానికి పరిచయం చేసిన ఘంటసాల ఇప్పటికే కాదు ఎప్పటికీ నేపధ్యగాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోతారు.

ఘంటసాల పాడిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం. ఎంత మంది గాయకులతో కలిసి పాడుతున్నా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగల ఒకే ఒక గొంతు ఘంటసాలది. పాట చివరలో ఒకే ఒక్క పాదాన్ని పాడి కూడా మొత్తం పాట క్రెడిట్ కొట్టేయడం ఘంటసాల సొంతం. ఇందుకు నిదర్శనం ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ‘పాడవేల రాధికా’ అన్న పాట. ఇందులో ఘంటసాల చివరలో చిన్న ముక్క పాడతారు. మొత్తం పాట అంతా సుశీలదే ఉంటుంది. కానీ ఆ ఒక్క ముక్కలో ఘంటసాల సుశీలపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారు. ఇది ఆయనకు జన్మత: వచ్చిన గాన మాధ్యుర్యం. అంతే కాదు ఘంటసాలకున్న మరో ప్రత్యేకత మరే ఇతర గాయకులకు లేని లక్షణం. ఘంటసాల ఏ నటుడుకి పాడుతున్నారో ఆ నటుడే స్వయంగా ఆ పాట పాడుతున్నాడా అన్న అనుభూతికి లోను చేయడం. ఏపాటకు ఎంత మోతాదులో భావం పలికించాలో ఆయనకు ఎవరూ వివరించనవసరం లేదు. తరవాతి తరం గాయకులలాగా కృత్రిమంగా, కష్టపడి భావం కోసం ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదని నాకు అనిపిస్తుంది.

సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు అయిన ఘంటసాల రచయిత కూడా. ఇది చాలా కొద్ది మందికి తెలిసిన విషయం. ఘంటసాల పాడిన లలిత గీతాల్లో చాలా శాతం ఘంటసాల రచించినవే. వాటిల్లో ఒక ఆణిముత్యం బహుదూరపు బాటసారి అన్న పాట. పాట వినడానికి ఎంత మధురంగా ఉంటుందో అందులోని అర్ధం అంత గాంభీర్యంగా ఉంటుంది.
బహుదూరపు బాటసారీ..
ఇటురావో ఒక్కసారీ…
అర్ధరాత్రి పయనమేలనోయి
పెను తుఫాను రేగనున్నదోయి
నాకుటీరమిదేనోయి
విశ్రమింపరావోయి
వేకువనే పోదమోయి
పయనమెచటికోయి నీ
దేశమేనటోయి
నా ఆశలు తీరెనోయి
నీతో గొని పోవోయి.

ఇలా పాట అంతా సాగుతుంది. మృత్యువు అంటే భయంలేని వ్యక్తి పాడుకునే పాటగా ఘంటసాల దీన్ని అభివర్ణించేవారట. ఇది కాక ఘంటసాల ఇంకా చాలా భక్తి గీతాలు, తాత్విక గీతాలు , వలపు గీతాలు కూడా రాశారు.

మొదటే చెప్పినట్టుగా ఘంటసాల గురించి ఎంతరాసినా తక్కువే అవుతుంది. చంద్రుడికో నూలుపోగు అన్న చందంగా ఘంటసాల వర్ధంతి సందర్భంగా  v6 తెలంగాణ నివాళి .

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy