18న తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు 


హైదరాబాద్: రాష్ట్ర సాధనలో ప్రతి రచయిత చేసిన కృషి, పాత్ర మరువలేనిదన్నారు ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18న బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని మెయిన్ హాలులో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి, పొట్లపల్లి వరప్రసాద్‌రావు, వేణుగోపాల్‌, ఎం మల్లయ్యతో కలిసి ఆయన తెలంగాణ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పడకముందు రచయితలు నిర్వహించిన పాత్ర వేరు, ఇప్పుడు నిర్వహించాల్సిన పాత్ర వేరు అని అన్నారు పొత్తూరి వెంకటేశ్వరరావు.  ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరచిన కీర్తి పత్రికలకు ఉందన్నారు.

భాషా సాహిత్యాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని జయధీర్‌ తిరుమలరావు అన్నారు. రచయితల వేదిక మొదటి నుంచి జనంతో మమేకమై పనిచేస్తున్న సంస్థ అన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా రచయితలు ఎలా మారాలి, రచయితల కర్తవ్యం ఏమిటి.. అనే అంశాలతో పాటు పలు అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణ మాండలికాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 18న సుందరయ్య విజ్ఞాన కేంద్రం కపిలవాయి లింగమూర్తి ప్రాంగణం, అలిశెట్టి ప్రభాకర్‌ వేదికపై తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు ప్రారంభమవుతాయన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, నల్లమల కళావేదిక తదితర సంస్థలతో సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు ఉంటాయని చెప్పారు తిరుమలరావు.  200మందికి పైగా రచయితలు మహాసభల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.

‘సాహిత్య సాంస్కృతిక రంగం – వర్తమానం – సవాళ్లు’ పై చర్చ ఉంటుందన్నారు జయధీర్. వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. నాగభూషణం నివేదిక అందజేస్తారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ తమిళ రచయిత్రి పి శివకామి ప్రారంభోపన్యాసం చేస్తారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ప్రముఖ రచయిత ప్రొఫెసర్‌ హెచ్‌ఎస్‌ శివప్రకాష్‌ కీలకోపన్యాసం చేస్తారని చెప్పారు జయధీర్ తిరుమలరావు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy