విషాద యాత్ర.. 24 మంది విద్యార్థుల గల్లంతు..!

vnr-college-students-missingహైదరాబాద్ వి.ఎన్.ఆర్ కాలేజ్ విద్యార్థుల విహార యాత్ర విషాద యాత్రగా మిగిలింది. హిమాచల్ ప్రదేశ్ యాత్రకు వెళ్లిన విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతయ్యారు. కులుమనాలిలోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతవ్వడం వారి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. నది పరవళ్లు, మనాలి అందాలను ఆస్వాదిస్తూ.. కేరింతల్లో మునిగి తేలుతూ.. ఫోటోలు దిగుతున్న విద్యార్థులపై బియాస్ నది ఒక్కసారిగా విరుచుకుపడింది. తమ కళ్లముందే స్నేహితులు కాగితం పడవల్లా కొట్టుకుపోతుంటే.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. పిక్నిక్ కు వెళ్లిన తమ బిడ్డలు ఇక తిరిగి రారని తెలిసిన తల్లిదండ్రుల గర్భశోకం వివరించలేనిది.

ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన.. దేశ వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ బాచుపల్లిలోని వి.ఎన్.ఆర్ కాలేజ్ కు చెందిన 49 మంది స్టూడెంట్స్, ముగ్గురు లెక్చరర్స్ కలిసి హిమాచల్ ప్రదేశ్ టూర్ కు వెళ్లారు. మొత్తం 51 మందిలో 17 మంది విద్యార్థులు, 5 మంది విద్యార్థినులు ఉన్నట్లు సమాచారం. లార్జీ డ్యాం నుంచి నీటిని ఒక్కసారిగా వదలడంతో ఫోటోలు దిగుతున్న స్టూడెంట్స్ ప్రవాహంలో కొట్టుకుపోయారు. కులు మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి నుంచి ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. సోమవారం ఉదయం ఆయన హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరారు. హైదరాబాద్ లో విద్యార్థుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 4023202813, 9440815887 నంబర్లను సంప్రదించాల్సింగా ప్రభుత్వం కోరింది.

గల్లంతయిన విద్యార్థులు :

గల్లంతైన వారిలో రిషితా రెడ్డి, రిదిమ, రిత్విక్, విజేత, ఉపేందర్, పరమేశ్వర్, తరుణ్, సాయిరాజ్, శివప్రకాశ్ వర్మ, విష్ణువర్ధన్, దేవాశిస్ బోస్, సందీప్, జగదీశ్, సాధిర్, మాచర్ల అనిల్, అరవింద్, మిట్టపల్లి అఖిల్, రాంబాబు, శ్రీహర్ష, కిరణ్ కుమార్ లు ఉన్నారు.

క్షేమంగా ఉన్నవారు :

చక్రవర్తుల కిరణ్, రఘువంశీ, నందమూరి బిశ్వాస్, పానుగంటి సృజన్, నితిన్, విజయ, రమణ్ తేజ్, రుషిక, దీప్తి, లావణ్య, చేతన్, దివ్య, నవ్య, అచ్యుత్, హనీష్, ప్రకాశ్, రాకేశ్, రాఘవేంద్ర, సుహర్ష, శ్రీకాంత్, మోహన్, మౌనిక, పూర్ణ శేఖర్, సుజన్ లు క్షేమంగా ఉన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy