26/11ముంబై దాడుల పాపం పాకిస్ధాన్ దే : నవాజ్ షరీఫ్

FBముంబై దాడుల పాపం పాకిస్థాన్ దే అని మరోసారి రుజువైంది. సాక్షాత్తు ఆ దేశ మాజీ ప్రధానే ఈ మాట చెప్పారు. తమ దేశంలో ఉగ్రవాదసంస్థలు చురుగ్గా ఉన్నాయని కూడా చెప్పారు. అయితే.. ఆయన కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని.. ముంబై దాడులు పాక్ పనే అని తమకు ఎప్పుడో తెలుసునంటున్నారు కేంద్రమంత్రులు.
పాకిస్థాన్ పంపిన ఉగ్రవాదులే ముంబై దాడుల26/11 కు కారణమని పరోక్షంగా చెప్పారు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. పాక్ లో ఉగ్రవాద సంస్థలు చురుగ్గా ఉన్నాయన్నారు. అలాంటి వాటిని సరిహద్దులు దాటించి 150 మంది మరణానికి కారణమవుతామా..? ఇంకా ఎందుకు విచారణ పూర్తి చేయలేకపోతున్నాం.. అని ప్రశ్నించారు. డాన్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాటలు అన్నారు. అయితే ముంబై దాడులతో సంబంధమున్న ఉగ్రవాద సంస్థ పేర్లు గానీ, ఉగ్రవాదుల పేర్లుగానీ ఆయన ప్రస్తావించలేదు.
ముంబై దాడులే కాదు.. దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులన్నింటి వెనుక పాకిస్థాన్ ప్రభుత్వ హస్తముందని ఆరోపించారు విదేశాంగశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ అహిర్. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పేకంటే ముందే తమకు ఈ విషయం తెలుసునన్నారు. అంతర్జాతీయ వేదికలపై చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పామన్నారు. ఉగ్రవాదులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కుంటోందని చెప్పారు. ISI, ఆర్మీ చేతిలో పాకిస్థాన్ ప్రభుత్వం తోలుబొమ్మలా మారిందని ఆరోపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్. ముంబైదాడుల ఉగ్రవాదులు తమ దేశం వారేనని తెలిసినా.. పాకిస్థాన్ కోర్టులో ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
నవాజ్ షరీఫ్ కామెంట్స్ పై రక్షణరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై దాడుల ఉగ్రవాదులు పాకిస్థాన్ వారేనని నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్ని ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు తమదేశం వారేనని మాట్లాడటమేంటన్నారు.
2008 లో జరిగిన ముంబైలో 10 మంది ఉగ్రవాదులు మూడురోజులు మారణహోమం సృష్టించారు. ఇది పాకిస్థాన్ ఉగ్రవాదుల పనేనని గుర్తించిన భారత్.. దీనికి సంబంధించిన చాలా ఆధారాలు పొరుగుదేశానికి అందజేసింది. దోషులను శిక్షించాలని కోరింది. కానీ దీనిపై పాకిస్థాన్ స్పందించలేదు. ఇప్పుడు సడెన్ గా నవాజ్ షరీఫ్ ఈ అంశాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy