30 ఏళ్ల తర్వాత కలిసింది : మతిస్థిమితం కోల్పోయి.. తప్పిపోయిన మహిళ

30 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ మతిస్థిమితంలేని తల్లి అనూహ్యంగా బిడ్డల వద్దకు చేరింది. దీంతో ఆ ఫ్యామిలీ పట్టరాని సంతోషంలో మునిగితేలుతోంది. అసలు ఇన్నిరోజులు తమ తల్లి ఎక్కడ ఉందో తెలియదు. ఏం చేస్తుందో తెలియదు. అసలు బతికి ఉందోలేదో. అనుకున్న తరుణంలో ఇలా సడెన్ గా అమ్మ కనిపించేసరికి కన్నీటి పర్యంతమయ్యారు.  అచ్చం సినిమా స్టోరీలా ఉన్న ఈ రియల్ స్టోరీ వరంగల్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బండి రామక్కకు ఒక కుమారుడు..ఇద్దరు కుమార్తెలు. 30 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఆమె..ఓ రోజు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. కుమారుడు, కుమార్తెలు ఐదేళ్లపాటు తల్లి కోసం పలు చోట్ల గాలించినా..ఆచూకీ లభించలేదు.

రామక్క చివరకు ముంబయికి చేరింది. రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత భరత్‌ పట్వాని స్థాపించిన శ్రద్ధ రీహాబిలిటేషన్‌ ఫౌండేషన్‌ ఆమెను చేరదీసింది. కొన్నేళ్లపాటు వైద్య సేవలందించిన తర్వాత ఆమె ఆరోగ్యం ఇటీవలే కుదుటపడింది. తర్వాత ఆ సంస్థ ఆమెను ముంబయిలోని సేవా కంకళ్‌ ట్రస్టుకు అప్పగించింది. ట్రస్టు ప్రతినిధులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించాలని భావించారు. ఆమె చెప్పిన చిరునామా ఆధారంగా సంస్థ ప్రతినిధులు శుక్రవారం(ఆగస్టు-10) రామక్కను వరంగల్‌ రూరల్‌ ఇల్లా కోరుకొండపల్లికి తీసుకెళ్లారు.

ఆ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన వ్యక్తులెవరూ లేరని, ఆమె సంతానం ఖానాపురంలో ఉంటున్నారని స్థానికులు చెప్పిన మీదట ఖానాపురం తీసుకొచ్చారు. వాహనం దిగిన వెంటనే కుమారుడు కృష్ణ, పెద్ద కుమార్తె పద్మ తల్లిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. రామక్క కూడా బిడ్డలను పొదవి పట్టుకుని మనసారా ఏడ్చింది. ట్రస్టు బాధ్యులు రెహాన్‌, సులేఖ, ప్రదీప్‌, మలేష్‌, గణేష్‌ లను గ్రామస్థులు అభినందించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన బింబి, సల్లపల్లికి చెందిన వెంకటేశ్వరమ్మలనూ తాము తీసుకొచ్చామని, వారినీ స్వస్థలాలకు చేరుస్తామని తెలిపారు సంస్థ ప్రతినిధులు.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy