చంద్రబాబు కష్టాలకు అదే కారణమా..?

Naidu_BhoomiPooja_2430078gనవ్యాంధ్ర రాజధానికి భూమిపూజలో వాస్తుదోషాలు ఏమైనా ఉన్నాయా. ముహూర్త బలం అనుకూలంగా లేదా. ఏపీ సీఎం చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలకు ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ ఇబ్బందికర పరిస్థితులకు.. అవేమైనా కారణమా. ఇవే ప్రశ్నలు టీడీపీ నేతలను, బాబు అనుచరులను తొలిచేస్తున్నాయి. దీంతో ప్రస్తుత పరిస్థితికి కారణాలు.. పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టారు పచ్చపార్టీ నేతలు.

ఏపీ కొత్త రాజధాని అమరావతికి భూమిపూజ చేసేందుకు జూన్  6వ తేదీ ఉదయం 8.49 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. అనుకున్న విధంగా 6వ తేదీ.. గుంటూరు జిల్లా మందడంలో భూమిపూజ చేసి బొడ్రాయిని ప్రతిష్టించారు. ముహూర్తం ఖరారు చేసినప్పటి నుంచి బాబుకు ఎప్పుడు లేని కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే.. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి దొరికిపోవటం.. అదే కేసులో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్  సంభాషణలు బయటపడటం.. ఆ తర్వాత జరుగుతున్న వరుస సంఘటనలతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. దీంతో టీడీపీ నేతలకు కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

కొత్త రాజధాని భూమిపూజలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా. భూమిపూజ తర్వాత వాస్తుకు సంబంధించి చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు ఏపీ నేతలు. ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నారు.. సీఎం చంద్రబాబు ఆథ్యాత్మిక అంశాలను పర్యవేక్షించే యోగం నాయుడు. రాజధానికి భూమిపూజ చేసిన గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరుకు చెందిన భట్టాచార్యులు అనే వ్యక్తితో.. యోగంనాయుడు, గుంటూరు కలెక్టర్  కాంతిలాల్  దండే, వాస్తు పండితుడు రాఘవయ్య గోప్యంగా కలుసుకుని చర్చించినట్లు సమాచారం. బొడ్రాయి స్థాపన తర్వాత చేయాల్సిన పూజలు, చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తొలగేందుకు చేయాల్సిన హోమాలపై వారు మంతనాలు జరిపినట్లు సమాచారం. అడ్డంకులు తొలగేందుకు రహస్యంగా పూజా కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రస్తుతానికి చంద్రబాబు జాతకం బాగానే ఉందని భట్టాచార్యులు చెప్పినట్లు తెలిసింది. చిన్నచిన్న అవాంతరాలు తప్పవని, అయినా వచ్చే ముప్పేం లేదని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో అడ్డంకులు తొలిగిపోయేందుకు మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసి.. రహస్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy