AICTE: 30% సీట్లు నిండకుంటే గుర్తింపు రద్దు

aictఇంజినీరింగ్ కాలేజీల కొనసాగింపు పై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో  కనీసం 30% సీట్లు భర్తీ కాకపోతే… ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వాటి  గుర్తింపు రద్దు చేస్తమని స్పష్టం చేసింది. అయితే బ్రాంచీల వారీగా ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. అంటే ఏదైనా బ్రాంచీలో గుర్తింపు పొందిన సీట్లలో కనీసం 30 శాతం సీట్లు భర్తీ కాకుంటే.. ఆ బ్రాంచీకి అనుమతి రద్దవుతుంది.

ప్రతి కాలేజీలో బ్రాంచీల వారీగా వివరాలను తీసుకుని చర్యలు చేపట్టేలా AICTE త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. AICTE ఇటీవల ఢిల్లీలో వివిధ రాష్ట్రాల్లోని కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీల వైస్‌ చాన్సలర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించింది.

వివిధ రాష్ట్రాల్లో 30 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా రాష్ట్రాల సాంకేతిక విద్యా శాఖలు సేకరించేందుకు AICTE ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం స్పెషల్ ఫార్మాట్‌ ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం… 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 6 వేల 472 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా… వాటిలో 29,98,298 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇందులో 15,41,182 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే దాదాపు సగం సీట్లు ఖాళీగానే ఉన్నాయి.

ఈ లెక్కన 30 శాతం సీట్లు భర్తీ కానీ కాలేజీల సంఖ్య దాదాపు వెయ్యి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాంటి కాలేజీలను కొనసాగించడం సాధ్యం కాదని… అందుకే కనీస సంఖ్యలో సీట్లు నిండని బ్రాంచీలను రద్దు చేయడమే మంచిదని AICTE డిసైడ్ అయ్యింది. అయితే ఓ విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో 30 శాతం కంటే తక్కువ సీట్లు భర్తీ అయినా… తర్వాతి ఏడాది ఎక్కువగా భర్తీ అయ్యే అవకాశముందన్న అభిప్రాయం ఉంది. దీంతో ఏ ఏడాదికా ఏడాది సీట్ల భర్తీని బట్టి అనుమతి రద్దుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో 30శాతంలోపు సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్యను తేల్చేందుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్‌–డి కాలేజీల్లో కన్వీనర్‌ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 22 బ్రాంచీలు పూర్తిగా నిండిపోగా.. 9 బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి. కాలేజీల వారీగా చూస్తే.. 91 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 12 కాలేజీల్లో 50 మందిలోపే విద్యార్థులు చేరగా.. తొమ్మిది కాలేజీల్లో సింగిల్‌ డిజిట్‌లోనే చేశారు. అంటే ఈ 21 కాలేజీలతోపాటు మరో 30 నుంచి 40 కాలేజీల్లో 30 శాతంలోపే సీట్లు నిండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు తేల్చాక AICTE కి నివేదించే అవకాశముంది. మరోవైపు పాలిటెక్నిక్‌ కాలేజీల్లోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశముంది.

డిగ్రీలో 25 శాతంలోపు ప్రవేశాలుంటే రద్దు..

ఇక డిగ్రీలో 25 శాతంలోపు సీట్లు భర్తీ అయిన కోర్సులను కొనసాగించవద్దని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. దీనిపై అన్ని యూనివర్సిటీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 25శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల వివరాలను సేకరించి.. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఆయా కాలేజీల్లో ఆ కోర్సు ప్రవేశాలను కొనసాగించవద్దని స్పష్టం చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy