అసెంబ్లీ ఈరోజు ప్రత్యక్ష దృశ్యం, మీకోసం ప్రత్యేకంగా…

gr

దేశ రాజధానిలో T బిల్లు పూర్తి స్పీడ్ తో వెళుతున్న తరుణంలో ఇక్కడ హైదరాబాద్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనై… ఢిల్లీ లో పలు విపత్ పరిణామాల వల్ల తెలంగాణా, సీమాంధ్ర నాయకుల మధ్య సయోధ్య అనే మాటకే తావులేని సమయంలో మొదలైన ఈ మొక్కుబడి తంతు ఎలాసాగిందో నా కళ్ళతో చూడండి…

ఢిల్లీ AP భవన్ ఘటన తర్వాత నుంచి సీఎం కిరణ్ పై వార్ ను కొనసాగిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఇవాళ వ్యూహాత్మకంగా అడుగేసిన టీ మంత్రులు సీఎం కు మరో షాక్ ఇచ్చారు. తాము ఒప్పుకోనప్పుడు సీఎం మొత్తం సభా నాయకుడు ఎలా అవుతాడంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ సభ్యులతో కలసి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుతగిలి సభను వాయిదా వేయించారు మంత్రులు…

ఢిల్లీలో సీఎం బస్సుకు అడ్డుకు తగిలిన తెలంగాణ మంత్రులు బడ్జెట్ సమావేశాల్లో కూడా తమ కోపం చూపించారు. ఉదయం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం పై తమ నిరసన తెలిపేందుకు అవకాశమివ్వాలంటూ స్పీకర్ ను మైక్ అడిగారు. స్పీకర్ టీ మంత్రులకు మైక్ ఇవ్వకుండా ఆర్థిక మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డికి అవకాశమివ్వడంతో ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ సీట్లోనే నిల్చుని తెలంగాణ మంత్రులు తీవ్ర నిరసన తెలిపారు. ముఖ్యంగా టీ బిల్లును తిరస్కరిస్తూ మూజు వాణి ఓటుతో సభ ఏకగ్రీవ తీర్మానం చేసిందని స్పీకర్ ప్రకటించడం, తన పంతం నెగ్గిందని సీఎం జబ్బలు చరుచుకోవడంపై వాళ్ళు తీవ్రంగా ఫైర్ అయ్యారు. సభలో గందరగోళం ఏర్పడటంతో ఎల్లుండికి వాయిదా వేశారు స్పీకర్

సభ ప్రారంభం కావడానికి ముందే తెలంగాణ మంత్రులంతా జానారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు.  సంప్రదాయం ప్రకారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశానికి ముందుగా జరగాల్సిన క్యాబినెట్ భేటీకి వెళ్లాలా వద్దా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు టీ మంత్రులు.  ఢిల్లీలో తీవ్ర అవమానం చేసిన సీఎం మొహం చూసేదే లేదని మహిళా మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి,  గీతారెడ్డి తేల్చిచెప్పారు. సీఎం కిరణ్ నాయకత్వంలోని క్యాబినెట్ మీటింగ్ కు ఇక నుంచి పోనే పోకూడదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా చెప్పేశారు. మిగతా మంత్రులంతా వీళ్లతో ఏకీభవించారు. అంతలోనే జానారెడ్డికి ఢిల్లీనుంచి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి క్యాబినెట్ మీటింగ్ కు వెళ్లాలని సూచించారు. అయినా కూడా తెలంగాణ మంత్రులు వెనక్కి తగ్గలేదు. మొత్తానికి తెలంగాణ మంత్రులు అందరూ కలిసి కట్టుగా క్యాబినెట్ మీటింగ్ ను బహిష్కరించారు. ఎప్పుడూ వీళ్లకు భిన్నంగా వ్యవహరించే హైదరాబాద్ మంత్రులు దానం, ముఖేష్ కూడా టీ మంత్రుల సలహాతో అసెంబ్లీలోనే ఉండి కూడా కమిటీ హాల్ లో జరిగిన క్యాబినెట్ మీటింగ్ ను బహిష్కరించారు.

తెలంగాణ మహిళా మంత్రులు సీఎం పై కోపాన్ని ఆయన అనుచరుల దగ్గర కూడా లాబీల్లో చూపించారు. సీఎంకు సన్నిహితుడిగా మెలుగుతున్న గాదే వెంకటరెడ్డి,  డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డిలకు లాబీలో ఎదురు పడ్డారు. క్యాబినెట్ ను బహిష్కరించే వాళ్లు రాజీనామా చేసి నిరసన తెలుపొచ్చు కదా అని గాదే వెంకటరెడ్డి మహిళా మంత్రులను ఎత్తిపొడిచారు. వెంటనే “ఢిల్లీలో దీక్ష కు కూర్చునే ముందు రాజీనామా చేయాల్సింది పోయి  మీ నాయకుడు ఇంకా ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారని” ఆయన కు చెంపమీద కొట్టినట్లు సమాధానం చెప్పారు సునీతా లక్ష్మారెడ్డి. దీంతో గాదె వెంకటరెడ్డి తోకముడిచారు.

అదే లాబిలో పీసీసీ చీఫ్ బొత్సకు మహిళా మంత్రులు ఎదురయ్యారు. క్యాబినెట్ మీటింగ్ కు వచ్చి నిరసన తెలిపితే బాగుండేదని ఆయన అభిప్రాయ పడ్డారు. నిజమే కావచ్చు కాని తాము కిరణ్ కుమార్ రెడ్డి మొహాన్నే చూడదలచుకోలేదని చెప్పారు మహిళా మంత్రులు. దీంతో ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు.

వ్యక్తిగతంగా టీ బిల్లును తిరస్కరిస్తూ  కిరణ్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని మొత్తం ప్రభుత్వం అభిప్రాయంగా ఏకగ్రీవంగా సభ ఆమోదించిందంటూ పంపించడాన్ని T మంత్రులంతా తీవ్రంగా తప్పు  పడుతున్నారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లోని మిగతా రోజుల్లో కూడా తమ నిరసన కొనసాగించాలని టీ మంత్రులు నిర్ణయించుకున్నారు.

మరోవైపు బీఏసీ సమావేశంలో స్పీకర్ పై ఫైర్ అయ్యారు హరీష్ రావు. సీఎం కిరణ్ ప్రవేశ పెట్టిన టీ బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం ప్రవేశ పెడితే అందులో తాము భాగస్వాములం కాబోమన్న టీ మంత్రుల మాటలను, అసెంబ్లీ రికార్డులను ఎలా మరిచిపోయారని ప్రశ్నించారు హరీష్. కిరణ్ కేవలం సీమాంద్రకే సీఎంగా వ్యవహరించి ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా సభ ఆమోదించిందని ఎలా ప్రకటిస్తారని స్పీకర్ ను హరీష్ రావు నిలదీశారు. పైగా తాము ఓటింగ్ కోసమో, తమ అభిప్రాయమో చెప్పే ప్రయత్నం చేస్తే సీమాంధ్ర కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తనను పట్టుకుని కింద పడేసి దిగ్బంధనం చేస్తే కనిపించలేదా అన్నారు హరీష్. హరీష్ రావు వాదనతో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఏకీభవించారు.  స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని మండిపడ్డారాయన. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసి సీఎం కిరణ్ పక్షపాత దోరణికి జీ హుజూర్ అన్నట్లు వ్యవహరించారని ఆరోపించారాయన. స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా టీఆర్ఎస్ తో కలిసి తాము కూడా బీఏసీ నుంచి బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు అక్బరుద్దీన్ ఓవైసీ.

ఇదీ ఇవాళ్టి అసెంబ్లీ ప్రత్యక్ష దృశ్యం…

సంగప్ప జెనవాడే, v6

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy