“C/o కంచరపాలెం”: సినిమా రివ్యూ

ఓ జీవన చిత్రం “C/o కంచరపాలెం”

రొటీన్ సినిమాలకు కాలం చెల్లిపోయి.. కమర్షియల్ సినిమాలు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే చెల్లుబాటు అవుతోన్న తరుణంలో చాలామంది యువదర్శకులు వైవిధ్యభరిత కథాంశాలతో తెలుగు సినిమాకు నూతన సొగబులు అద్దుతున్నారు. ఈ క్రమలో వెంకటేశ్ మహా అనే యువదర్శకుడు.. సినిమా స్టూడియోలకు, రెగ్యులర్ నటీనటులకు దూరంగా ఓ  గ్రామంలోని వ్యక్తులతో అక్కడే చిత్రీకరణ చేసి, సురేశ్ బాబు వంటి నిర్మాతను మెప్పించి శుక్రవారం ‘కంచరపాలెం’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఇంతకూ ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథగా చెప్పాలంటే..

కంచరపాలెం అనే ఊర్లో జరిగిన నాలుగు ప్రేమకథలే ఈ సినిమా. సుందరం, సునీతలది పాఠశాల ప్రేమైతే, భార్గవి-జోసఫ్‌లది కాలేజీ వయసులో గొడవలతో మొదలైన ప్రేమ. సలీమా, గడ్డంలది వైన్ షాపు ప్రేమ కథ. ఇక రాధ, రాజులది లేటు వయసులో మొదలైన ఆఫీసు లవ్ స్టోరీ. ఈ నలుగురి జీవితాలతో ముడిపడిన 50కి పైగా సహాయ పాత్రలు. వీరి ప్రేమకథలు ఎలాంటి జీవితగమ్యం చేసుకున్నాయి అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే…

హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్, డ్యూయట్స్, ఐటం సాంగ్స్ లేవు.. కేవలం బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. స్వీకార్ అగస్తీ నేపథ్య సంగీతం సినిమాను నడిపిస్తుంది. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్ అంటూ లేవు. సిట్యువేషనల్ కామెడీతోనే నవ్వేసుకోవచ్చు. ఇంతటి ప్రతిభ చూపిన దర్శకులు మహా వెంకటేశ్, ఇలాంటి సినిమాను నిర్మించేందుకు సాహసించిన విజయ్ ప్రవీణ పరుచూరి, ప్రమోట్ చేస్తోన్న రానా దగ్గుబాటి ప్రశంసనీయులు.

పాత్రలు, వారి జీవితాలు తప్ప నటీనటులు కనిపించవు. సహజమైన మాటలు మినహా పంచ్ లు, ప్రాసలు వినిపించవు. అవసరమా ఈ సినిమాకు ఇంటర్వల్ అనేపించేలా మాయ చేస్తూ మనల్ని తన ప్రపంచంలో మమేకం చేసుకుటుంది ఈ కంచరపాలెం.

సమీక్ష

రాజమౌళి, క్రిష్ సహా పలువురు దర్శకులు చెప్పినట్టు ఈ సినిమాలోని పాత్రలు థియేటర్ నుంచి ఇంటికెళ్లాక కూడా మనతో కలసి ప్రయాణం చేస్తాయి. ఇందుకు కారణం.. అతి సహజంగా సాగిన పాత్ర చిత్రణలు మాత్రమే కాదు, కథను రాసుకోవడంలో దర్శకుడి ప్రతిభ కూడా. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కారణంగా కంచరపాలెం కథలో మనం కచ్చితంగా వెనక్కు వెళ్లి ఒక్కో పాత్రను తరచి తరచి తదేకంగా చూస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటాం.

అలాగని అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, ఆలోచింపజేస్తుందని కూడా చెప్పలేం. కానీ కమర్షియల్ సినిమాలు చూసి చూసి వెగటు పుట్టిన సగటు ప్రేక్షకుడికి సినిమా అంటే ఇలాగే ఉంటుందా అనే భ్రమల నుంచి, ఇలా కూడా ఉండొచ్చుగా అనే ఆశలపల్లకి వైపు అడుగులు వేయిస్తుంది. వాస్తవికత అంటే హింస, అశ్లీలత, అసభ్యతతో కూడిన జుగుప్స మాత్రమే కాదు. ఇవేవి లేకుండా కూడా సహజత్వానికి దగ్గరగా నిజమైన జీవితాలు చూపించొచ్చు. మనిషి జీవితానికి మతం మాత్రమే సరిపోదు.. మానవత్వం కూడాననే సందేశాన్ని ఈ సినిమాతో దర్శకుడు ఇచ్చాడు.

C/o కంచరపాలెం అనే టైటిల్ లో ఓ ప్రాంతం మాత్రమే కనిపిస్తోంది. కానీ నిజానికి ఇది మన దేశంలోని ఎన్నో గ్రామాలను, పట్టణాల్లోని బస్తీలను రిప్రజంట్ చేసిన సినిమా. ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఎంపికైన ఈ సినిమాకు ఈ ఏడాది మరిన్ని అవార్డులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రొటీన్ కమర్షియల్ హంగులకు దూరంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఏస్థాయి విజయం లభిస్తుంది అన్నది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.

రేటింగ్.. 3.25/5

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy