FRDI బిల్లుతో అభద్రతభావం : అందుకే ప్రజలు బ్యాంకుకు దూరం

banks-atmsకరెన్సీ కష్టాలు మళ్లీ మొదలవడంతో జనాలు జాగ్రత్త పడుతున్నారు. చేతికొచ్చిన నగదును చేజారిపోనివ్వడం లేదు. గతకొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లేగాక దేశంలోని చాలా రాష్ర్టాల్లో ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. నగదు కొరత దృష్ట్యా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నోట్ల ముద్రణను పెంచినా.. పరిస్థితులు చక్కబడటం లేదు. డిపాజిట్ల కంటే బ్యాంకుల్లో విత్‌ డ్రాలే ఎక్కువయ్యాయి. ఆర్బీఐ తాజా వివరాల ప్రకారం ఈ నెల మొదటి మూడు వారాల్లో బ్యాంకుల నుంచి రూ.59,520 కోట్ల నగదు ఉపసంహరణ జరిగింది. అంతకుముందు మూడు వారాల్లో ఇది రూ.16,470 కోట్లుగా ఉండగా, ఒక్క ఏప్రిల్ 20తో ముగిసిన వారం రోజుల్లోనే రూ.16,340 కోట్లను జనాలు తిరిగి తీసేసుకొన్నారు. ఇక ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1.4 లక్షల కోట్ల నగదు ఉపసంహరణలు జరిగాయి. గతేడాది జనవరి-మార్చితో పోల్చితే ఇది దాదాపు 27 శాతం అధికం కావడం విశేషం. 2016, నవంబర్ 8 రాత్రి పాత పెద్ద నోట్ల (రూ.500, 1,000)ను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ప్రకటించిన సంగతి విదితమే. అయితే అప్పుడు చలామణిలో ఉన్న కరెన్సీ కంటే ఇప్పుడు సుమారు రూ.లక్ష కోట్లు ఎక్కువే ఉంది. ప్రస్తుతం రూ.18.90 లక్షల కోట్లకు సమానమైన కరెన్సీ మార్కెట్‌లో ఉండగా, రద్దు సమయంలో ఉన్నది రూ.17.98 లక్షల కోట్లే. అయినప్పటికీ నగదు కొరత వేధిస్తుంది. పరిస్థితి అదుపులోకి వస్తున్నదంటూ బ్యాంకులు చెబుతున్నా.. ఆ దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.

జనాలు మళ్లీ డబ్బు దాచేసుకుంటుండటమేనని, ఖర్చు చేయకపోవడమేనని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ, నిశితంగా గమనిస్తే అసలు కారణాలు అనేకం బయటపడుతున్నాయి. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై చెలరేగిన భయాందోళనలు, బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలు, మోసాలు, రుణ ఎగవేతలు.. ఈ నగదు ఉపసంహరణలకు ప్రధానంగా దోహదం చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకుల్లో మన సొమ్ముకు భద్రత లేదన్న అభద్రతాభావం ఖాతాదారుల్లో నెలకొంది. వరుస పరిణామాలు ఆ భావనను బలపరుస్తూ పోవడంతో ముందస్తు ఉపసంహరణలు పెరిగిపోయాయి. మరోవైపు ప్రజలు, వ్యాపారుల నుంచి బ్యాంకుల్లోకి డిపాజిట్లే కరువైపోయాయి.  ఆర్బీఐ పంపించే కొత్త నోట్లు మినహా.. బ్యాంకులకు నగదు పెద్దగా రావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే రూ.2,000 నోట్ల ముద్రణ ఆగిపోవడం కూడా ఈ సమస్యకు దారితీసింది. నిజానికి రోజుకు రూ.500 కోట్ల విలువైన రూ.500 నోట్లను ముద్రించే ఆర్బీఐ.. ఐదు రెట్లు పెంచి రూ.2,500 కోట్ల మేర నోట్లను అచ్చువేస్తుంది. అయితే కొన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలుండటంతో పెద్ద నోట్లన్నీ దాచేశారన్న అనుమానాలూ వ్యక్తమవుతుండగా, ఆర్థిక సంవత్సరం ఆఖరుతో ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు ఉండటం, ప్రజలు మళ్లీ డిజిటల్ పేమెంట్లను పక్కనబెట్టి, నగదు చెల్లింపులకే అలవాటు పడిపోవడం కూడా సమస్యను జఠిలం చేసిందంటుంది ఆర్బీఐ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy