GST ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ పై భారం

appartsసామాన్య ప్రజల సొంతింటి కలపై GST ఎఫెక్ట్ పడనుంది. ఇకపై అపార్ట్‌మెంట్లు కొనాలనుకునే వారిపై భారం పెరగనుంది. ఇప్పటివరకు ఫ్లాట్‌ కొన్నపుడు రిజిస్ట్రేషన్‌ విలువ మీద స్టాంపు డ్యూటీలకు అదనంగా వ్యాట్‌, సేవల పన్ను కలిపి 5.75 శాతం వసూలు చేస్తున్నారు. వ్యాట్‌, సేవాపన్ను స్థానంలో కొత్తగా వస్తున్న GST లో ఈ పన్నును 12 శాతం శ్లాబ్‌లో చేర్చారు. దాంతో కొనుగోలుదారుపై 6.25 శాతం పన్ను భారం పెరగనుంది. రూ.25 లక్షల అపార్ట్‌మెంట్‌ కొంటే అదనపు పన్నుభారం రూ.1.5 లక్షల వరకు ఉంటుంది.

అయితే GST భారం కొనుగోలుదారులపై పడకుండా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కేంద్రం ప్రకటించింది. అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి సిమెంటు, ఇనుము తదితర సామగ్రిని కొనుగోలు చేసే సమయంలో బిల్డర్‌ జీఎస్టీని చెల్లిస్తారు. దాన్ని ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ సమయంలో మినహాయించాలి. ఉదాహరణకు సిమెంటు, ఇనుము తదితరాలపై జీఎస్టీలో 28 శాతం పన్ను నిర్ధారించారు. వాటికి ముందే GST  చెల్లించడంతో.. తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో దాన్ని తీసేసి మిగతాది చెల్లించాలి. ఇలా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఫ్లాటు విలువలో ఆరు శాతం వరకు ఉంటుందని అంచనా. దీన్ని రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే 12 శాతం జీఎస్టీ నుంచి మినహాయిస్తారు. మొత్తం మీద పన్నుభారం ఆరు శాతమే ఉంటుంది. ఇది ఇప్పుడు వ్యాట్‌, సర్వీస్‌ ట్యాక్సులు వసూలు చేస్తున్న 5.75 శాతానికి దాదాపు సమానం. ఇప్పటికే కట్టిన ఇళ్లను జూలై ఒకటి తర్వాత కొనేవారు బిల్డర్లను ఆరు శాతం అదనపు పన్ను భారాన్ని భరించమని కోరే అవకాశం ఉంది.

కేంద్రం ఇచ్చే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చాక నిర్మించిన అపార్ట్‌మెంట్లకే వర్తిస్తుంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వాటికి వర్తించదు. 80 శాతం వరకూ పూర్తయిన అపార్ట్‌మెంట్ల నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా పెద్దగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లభించదు. దీంతో ఇలాంటివారంతా తాము కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్లను తొందరగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను కొనుగోలుదారులకు కచ్చితంగా బదిలీ చేసి… వారిపై జీఎస్టీ భారం పూర్తిగా పడకుండా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. 12 శాతం జీఎస్టీలో సగం ఇలా బదిలీ చేస్తే మిగతా సగం కొనుగోలుదారులు చెల్లించేలా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఆరు శాతానికి మించి బిల్డర్‌కు వస్తే.. అంత మొత్తాన్నీ కొనుగోలుదారులకు బదిలీ చేయాల్సిందే.

జీఎస్టీతో బిల్డర్లపైనా స్వల్పభారం పడనుంది. సిమెంటు, ఇనుము, పెయింట్లు, టైల్స్‌ తదితర వస్తువులపై ఇప్పటివరకు కేంద్ర ఎక్సైజ్‌ పన్ను, వ్యాట్‌ కలిపి 27 శాతం వసూలుచేస్తున్నారు. ఇప్పుడు జీఎస్టీలో వీటిని 28 శాతం పన్ను శ్లాబులో చేర్చారు. ఒక శాతం మేర బిల్డర్‌పై భారం పెరగనుంది. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పాక్షికంగా పూర్తిచేశాక మిగిలిన పనుల్ని వర్క్స్‌ కాంట్రాక్ట్‌ పేరిట ఇతరులతో చేయిస్తుంటారు. ఇలా చూపించే వర్క్స్‌ కాంట్రాక్టుల పైనా జీఎస్టీలో 28 శాతం పన్ను చెల్లించాలి.

నిర్మాణరంగంపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచినా, పన్ను లెక్కింపు సమయంలో భూమి విలువను మినహాయిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో భూమి విలువ, భవనం విలువ రెండింటినీ కలిపి స్టాంపుడ్యూటీ వేస్తారు. ఇప్పుడు భూమి విలువను తప్పించడంతో ఊరట లభించినట్లయింది.

పేదల ఇళ్లపై భారం..

జీఎస్టీ పేదల ఇళ్లపై పెద్ద భారమే మోపనుంది. కాంట్రాక్టు విధానంలో నిర్మించే గృహాలన్నిటికీ కొత్త పన్ను వర్తిస్తుంది. పేదలకు కాంట్రాక్టు విధానంలో నిర్మించే ఇళ్లకు ప్రస్తుతం… 1.25 శాతం వ్యాట్‌, 4.5 శాతం సర్వీస్‌ టాక్స్‌ అమల్లో ఉంది. అందులోనూ పీఎంఏవై ఇళ్లకు సర్వీసుటాక్స్‌ మినహాయింపు ఉంది. జీఎస్టీలో ఈ ఇళ్లపై 18శాతం భారం పడుతుంది. ఇందులో ఎస్జీఎస్టీకి 9శాతం, జీఎస్టీకి 9శాతం వెళ్తుంది. ముందు పన్నులు చెల్లిస్తే అది కేంద్రానికి వెళ్లి, తిరిగి రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. అందుచేత ముందుగానే పన్నులు చెల్లించాలి. పన్నులు తిరిగి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం 9 శాతం పన్నును తిరిగి గృహనిర్మాణ శాఖలకు ఇస్తే కొంత భారం తప్పుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

ప్లాట్లకు, ఆక్యుపేషన్‌ సర్టిఫికెట్‌ పొందిన ఇళ్లకు జీఎస్టీ వర్తించదు.

డెవలపర్‌ ఆలస్యం చేస్తే పన్ను భారం డెవలపర్‌ చెల్లించాలి.

బిల్డింగ్‌ 90 శాతం జూలై 1కి ముందు పూర్తయినా జీఎస్టీ ప్రకారమే పన్ను చెల్లించాలి.

వాటర్‌ బిల్లుపై జీఎస్టీ ఉంటుంది. విద్యుత్‌ బిల్లుపై ఉండదు.

వస్తువు కొన్న 180 రోజుల్లో క్లెయిమ్‌ చేస్తేనే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy