మెడిసిన్ వదిలి ఉగ్రవాది అయ్యాడు.. కశ్మీర్ లో ఐపీఎస్ తమ్ముడు హతం

  • ఇవాళ సోపియన్ ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
  • వాళ్ల బంకర్ ను కూడా ధ్వంసం చేసిన ఆర్మీ

శ్రీనగర్: జనం దేవుడిలా చూసే డాక్టర్ కోర్సు వదిలేసి.. దుష్మన్లతో చేరాడు.. ఐపీఎస్ అధికారిగా అన్న సమాజానికి సేవ చేస్తుంటే.. తాను కుటుంబానికే చెడ్డ పేరు తెచ్చేలా ఉగ్రవాదులతో కలిసిపోయాడు. దేశంలో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైన అతడు.. చివరికి ఆర్మీ చేతిలో హతమయ్యాడు. మంగళవారం ఉదయం కశ్మీర్ లోని సోపియన్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు హిజ్బుల్ మొజాహిద్దీన్ ముష్కరులను మట్టుబెట్టింది ఆర్మీ.

సోపియన్ ప్రాంతంలోని హెఫ్ షీర్మాల్ లో హిజ్బుల్ మొజాహిద్దీన్ నక్కి ఉన్నారని మంగళవారం తెల్లవారు జామున ఆర్మీకి సమాచారం అందింది. దీంతో ఆర్మీ తన జవాన్లు, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. దట్టంగా మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా ముష్కరుల ఏరివేతకు రంగంలోకి దిగారు. హోరాహోరీ పోరు తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. టెర్రరిస్టులు దాక్కోవడానికి సేఫ్ ప్లేస్ గా వాడుకుంటున్న బంకర్ ను కూడా ధ్వంసం చేశారు.

కుటుంబం ఎంతో బతిమిలాడింది

ఆర్మీ ఎన్ కౌంటర్లో హతమైన హక్

ఆర్మీ చేతిలో హతమైన ఆ ముగ్గురు ముష్కరుల్లో ఒక్కడైన షంసుల్ హక్.. ఓ ఐపీఎస్ అధికారి తమ్ముడు. అతడు యునానీ మెడిసిన్ చదువుతుండగా టెర్రరిజం వైపు అట్రాక్ట్ అయ్యాడు. డాక్టర్ కోర్సు మధ్యలోనే వదిలేసి ఉగ్రవాదుల్లో చేరిపోయాడు. ఈ విషయం తెలిసి అతడి అన్న, కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా వినలేదు. చివరికి ఇలా ఆర్మీ ఆపరేషన్లో చనిపోయాడు. ఆ ఐపీఎస్ అధికారి కుటుంబం తమ బిడ్డను వెనక్కి రప్పించుకోవడం కోసం చేసిన ప్రయత్నాన్ని మాజీ కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.

24 గంటల్లో రెండో ఎన్ కౌంటర్

24 గంటల సమయంలో ఇది రెండో ఎన్ కౌంటర్. సోమవారం ఉదయం కూడా బుద్గాంలో అల్ బదర్ టెర్రరిస్టు గ్రూపుకు చెందిన ముగ్గురు ముష్కరులను ఆర్మీ హతమార్చింది. వారంతా సోపియన్ జిల్లాకు చెందిన వారే.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy