పాతబస్తీ నుంచి పార్లమెంటు దాకా..

  • కాకా ఆత్మకథ
  • నేటి నుంచి వెలుగు ‘దర్వాజ’లో..

కాకా జీవితం అంటేనే తెలంగాణ ఉద్యమ చరిత్ర. కన్నతండ్రినే ‘అయ్యా’ అని నోరారా పిలవని ఈ రోజుల్లో ప్రజలందరితో ‘కాకా’ అని పిలిపించుకున్న వ్యక్తిత్వం గడ్డం వెంకటస్వామిది. తెలంగాణ సమాజమే కుటుంబంగా, మురికివాడల పేదలే బిడ్డలుగా జీవించడం వల్లనే గుడిసెల మధ్య గుడిగా వెలుగుతున్నాడు. కల్పన కన్నా వింతగా తోస్తుంది వాస్తవం. కాకా వాస్తవ జీవితం అక్షరాలా కథలాగానే సాగుతుంది. అడుగడుగునా నరాలు తెగే ఉత్కంఠ. సీరియల్‌ కథ కన్నా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా కన్నా ఆసక్తిదాయకం. బయోపిక్‌ కు సరిపోయేంత విశాల జీవితం కాకా సొంతం. పాత బస్తీ నుంచి పార్లమెం ట్‌ దాకా ‘బూల్‌ బులయ్యా’ను మించిన లాబరింథ్‌ ను తొలిసారిగా తెలుగు పాఠకులకు సీరియల్‌ గా అందిస్తున్నాం.

కులతత్వం అనే విషనాగు క్రమంగా బలిసి, కొండచిలువై, అనకొండగా ఎదిగి, సమాజాన్ని మింగుతున్నప్పుడు ఫూలే, అంబేడ్కర్‌ ల బాటలో నడిచిన వెంకటస్వామి వంటి యోధుల జీవితం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈవారం నుంచే కాకా ‘మేరా సఫర్‌ ’ (రచనా సహకారం: పి.చంద్‌) ప్రారంభం.

ముందుమాట

నేను, నా కుటుంబం తెలంగాణే ఆశగా, శ్వాసగా ఉన్నం. సో యి వచ్చినప్పటి సంది ఈ గడ్డ కోసమే బతికినం. నిజాం కాలంల భూస్వామ్య శక్తుల చేతుల్లో తల్లి తెలంగాణ నరకయాతన పడుతుంటే నేను చూడలేకపోయిన. అందుకే తెలంగాణ విముక్తి పోరాటంల దునికిన. భరతమాత గుం డెలపై మణిపూసగా తెలంగాణ ఒదిగిన క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలతో నాతో పాటు ప్రతీ తెలంగాణ బిడ్డ తల్లడిల్లిండు. ఆంధ్రలో విలీనం తరువాత నా తెలంగాణ పడ్డ అరిగోసను చూస్తూ అనుక్షణం బాధపడ్డ. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండనే సచ్చిపోతనేమో అని చాలామంది ఆందోళన చెందారు . కానీ నేను తెలంగాణ చూసేదాం క బతికి ఉండేందుకు పోరాడిన. సో నియాగాంధీ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంగ ఏర్పడిం ది. సీమాంధ్రల పార్టీని చంపుకుని మరీ తెలంగాణ ఇచ్చిన సో నియమ్మ త్యా గాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ యాద్ మరవద్దు.

ఏమీ లేని నిరుపేదలకు కనీసం గూడు ఉండాలని గుడిసెల పోరాటం చే సిన. లేబర్ లీడర్ నుం చి నేషనల్ లీడర్ దాక ఎదిగిన. నన్ను వెతుక్కుంటూ ఎన్నో పదవులు వచ్చినయ్. జీవితంలో ఎంతో సాధించిన. కానీ ఏనాడు గరిబోడి కష్టాలను మరిచిపోలేదు. ఎందుకంటే నేను కూడా నిరుపేద కుటుంబం నుంచే వచ్చిన. అందుకే పేద ప్రజలకు నాచేతనైనంత చేసిన. అంతులేని వాళ్ల అభిమానాన్ని పొందిన.

నా సుదీర్ఘ  రాజకీయ జీవితంలో దేశంలో జరిగిన ఎన్నో పరిణామాలను చూసిన. తెలంగాణ, సీమాం ధ్ర రాజకీయాలను దగ్గరి నుంచి చూసినవాన్ని. వాటితో పాటు నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలను భావితరాలకు అందించాలనుకుంటున్న. అందుకే పుస్తకం రాయాలనుకున్న. నా జీవితంతో పాటు దేశంలో జరిగిన పరిణామాలను నాకు గుర్తున్నకాడికి ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చే సిన. ముసురుకున్న ముసలితనం నా జ్ఞాపకాల్లో కొన్నింటిని నా నుం చి దూరం చేసింది. అయినా గుర్తున్నకా డికి ఇందులో రాసిన. నిజాయతీతో, ఆత్మసాక్షిగా ఈ పుస్తకాన్ని రాసిన. దీన్ని చదివిన తరువా త ఒక్కరై నా స్ఫూర్తి పొందితే నా కష్టానికి తగ్గ ఫలితం దక్కినట్టే. ఇక నాతో పాటు నా జ్ఞాపకాల్లోకి పోదాం .

మీ కాకా

హైదరాబాద్ నగరంల పుట్టిన..

నేను 1929 అక్టోబర్ 5న నిజాం సంస్థానంలోని హైదరాబాద్ నగరంల పుట్టిన. చాలా మందికి తెల్వని ముచ్చట  ఏందంటె 1948 వరకు హైదరాబాద్ ప్రత్యేక దేశం. నేను పుట్టిన టైంల ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మా రాజు. సంస్థానంలోని 16 జిల్లాలను భాష ఆధారంగా 31 ప్రాంతాలుగా విభజించి నైజాం సర్కార్ పాలించింది. అప్పట్ల తెలుగు మాట్లాడే వారికి 8 జిల్లా లు, మరాఠి మాట్లాడే వారికి 5 జిల్లాలు, కన్నడ మాట్లాడే వారికి 3 జిల్లాలు ఉండె. నిజాం రాజు స్వతంత్రుడని చాలామంది అనుకుంటరు. అది నిజం కాదు. బ్రిటీష్ సామ్రాజ్యానికి నిజాం సామంతుడు. ఆయన పాలనను పర్యవేక్షించేందుకు కోఠి రెసిడెన్సీలో బ్రిటీష్ గవర్నర్ కూడా ఉండేటోడు.

పల్లెల్ల దొరల దోపిడీ

నాడు తెలంగాణల ఉన్న పదివేల గ్రామాలల్ల 2,600 ఊర్లు నిజాం జాగీర్లే. అంటే ఆయన సొంత ఆస్తులు. మిగతావి జమీన్ దార్లు, పటేల్, పట్వారీల కింద ఉండేవి. వీళ్లంతా నిజాం తొత్తు లు. కిందిస్థాయి అధికారాలన్నీ వీళ్లే చెలాయించెటోళ్లు. తెలంగాణ పల్లెల్ల సాగిన దౌర్జన్యాలు, దోపిడీకి వీళ్లే కారణం. అందుకే నాటి తెలంగాణ ప్రజలకు నిజాం కన్నా ఈ దొరల మీదనే ఎక్కువ వ్యతిరేకత ఉండేది. ఇది అప్పటి తెలంగాణల రాజకీయ పరిస్థితి.

అప్పట్ల రాజు ముస్లిం కావడంతో సహజంగనే ఇస్లాం సంప్రదాయాలు, విశ్వాసాలకు హైదరాబాద్ సంస్థా నంల ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అగ్రకులస్థులంతా నిజాంను ప్రసన్నం చే సుకోవడానికి ముస్లిం సంప్రదాయాల్నే పాటించారు. దొరలు, భూస్వాములు, జమీన్ దా ర్లు షేర్వానీ, రూమీ టోపీలు పెట్టుకొని నవాబుల్లా ముస్తాబయ్యేటోళ్లు. అట్ల ఉంటేనే హోదా అనుకునేవాళ్లు. ఆళ్ల ఇంట్ల ఆడోళ్లు బయటకొస్తే బురఖా వేసుకునేవాళ్లు. ఇంట్ల గోషా పద్ధతి ఉండేది. మిగతా కులాల్ల దీనికి భిన్నమైన వా తావరణం ఉండేది.

ఖాన్ దాన్ పేరు నిలబెడతననేటోడు

గడ్డం మల్లయ్య, పెంటమ్మ మా అమ్మానాయన. నాయన నిజాం సైన్యంల జవానుగా పనిచేసిం డు. మేం మొత్తం నలుగురు అన్నదమ్ములం. పెద్దన్న పేరు బాలయ్య, రెండో అన్న నర్సింహులు, తమ్ముని పేరు నారాయణ స్వామి. నా చిన్నప్పుడే పెద్దన్న బాలయ్య బీమార్ తో చనిపోయిండు. నాయనకు నేనంటేనే మమకారం ఎక్కువ. ఏదో ఒక రోజు వీడే ఖాన్ దాన్ పేరు నిలబెడతడని చు ట్టాలకు చెప్పుకుని ముర్శేటోడు. లాల్ దర్వాజ-గౌలిపుర మధ్యల ఉన్న తోపుఖానాల మాకో చిన్న ఇల్లు ఉండేది. నిజాం సైనికులు వాడే తోపుల (ఫిరంగుల లాంటివి)కు కావాల్సిన మందుగుండు తయారుచేసే పరి శ్రమ అక్కడ ఉండడంతో ఆ ప్రాంతానికి తోపుఖానా అని పేరొచ్చింది.

నిజాం సైన్యంల పని బిల్ కుల్ ఇష్టం లేకుండే..

పేరుకు నిజాం దగ్గర కొలువన్నట్టే గని నాయనకు జీతం శాన తక్కువొచ్చేది. ఆ కొంచెం సంపాదనతోనే మమ్మల్ని సాదిండు. అట్లని మాకు ఏ లోటూ రానియ్యలే. కండ్లల్ల పెట్టుకుని చూసుకున్నడు. అందుకోసం ఎంతో కష్టపడ్డడు. మమ్మల్ని మంచిగ పెం చడానికి నాయన పడ్డ తపన యాదికొస్తే నాకు బాధనిపిస్తది. కండ్లల్ల నీళ్లొస్తయ్. ఎప్పుడైనా గుండె బరువైనట్టు అనిపిస్తే మా నాయన గుండె నిబ్బరాన్నే గుర్తుచేసుకునేది. అంతే, కొండంత ధైర్యం అనిపించేది. మీకో ముచ్చట చెప్పాలి. నిజాం సైన్యంల పనిచేయడం నాయనకు బిల్ కుల్ ఇష్టం లేకుండె. స్వతంత్ర భావాలున్న నాయన, కుటుంబం కోసం మనసు చంపుకుని నిజాం దగ్గర పనిచేసిం డు. అయినా ఏనాడు తన అసంతృప్తిని మా ముందు బయటపెట్టలేదు. అట్లని ఎక్కువ దినాలు సైన్యంల పనిచేయలేక పోయిండు. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు అనుకుం ట నాయన నిజాం కొలువును వదిలేసిండు. ఓ మేస్త్రీ దగ్గర కూలీకి పోయిండు.

అమ్మే ఆదిగురువు

అమ్మ గురిం చి ఏ కొడుకైనా ఏం చెపుతాడు. అమ్మ మనసును చెప్పనీకి ఏ భాషలో మాటలున్నయి. మా అమ్మ పెంటమ్మకు పట్టుదల, ధైర్యం ఎక్కువ. వాటితో పాటు భూదేవికున్నంత ఓపిక ఉండేది. నాయన నిజాం కొలువు వదిలేసినంక ఇంటి ఆర్థిక పరిస్థితి ఏం బాగలేకుండె. ఒక్క పూట తినడానికి కూడా తక్లీఫ్ అయ్యేది. అట్లాంటి పరిస్థితులల్ల మా కడుపు నింపడానికి అమ్మ ఉపాసం ఉండేది. అమ్మకు తెలిసినంతగా ఆకలి విలువ ఇంకెవ్వరికీ తెల్వదు. అంత కష్టకాలంలోనూ ఇంటిముందుకొచ్చి చేయి చాపిన ఏ ఒక్కర్నీ ఉత్త కడుపుతో పంపిం చలేదు. తక్లీఫ్ లో ఉన్నప్పుడు ఎట్లుండాల్నో మా అమ్మను చూసే నేర్చుకున్న. అమ్మే నా ఆదిగురువు.

పంచములం కాదు.. ఆది హిందువులమన్నడు

మాది దళిత మాల కులం. ఎనకట్నుంచి మేం హైదరాబాద్ లనే ఉండడంతో తెలంగాణ ఊర్లల్ల దళితులు ఎదుర్కొన్న వివక్ష మాకెప్పుడూ ఎదురుకాలేదు. దక్కన్ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ ఆదిహిందూ పోరాట చైతన్యమే ఇందుకు కారణం. దళితులే ఈ దేశ మూలవాసీలన్న భాగ్యరెడ్డి వర్మ మేం పంచములం కాము… ఆది హిందువులమని చెప్పిండు. అంబేద్కర్ కంటే ముందే దక్కన్ ల దళితుల కోసం ఉద్యమిం చిన మహానుభావుడు భాగ్యరెడ్డి వర్మ. చదువుకుం టేనే సామాజిక హోదా దక్కుతుందన్న భాగ్యరెడ్డి వర్మ మాటల్ని నాయన నమ్మిండు. అందుకే నన్ను సుల్తాన్ బజార్ ఆర్యసమాజ్ స్కూల్ కు పంపిండు. భాగ్యరెడ్డి వర్మకు ఆర్యసమాజ్ తో అనుబంధం ఉండేది. దాంతో అప్పట్ల దళితులకు ఆర్యసమాజ్ అంటే ఇష్టముండేది. హిందూ ధర్మంల మూఢవిశ్వాసాలను ఎండగడుతూ స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజ్ హైదరాబాద్ సంస్థానంల క్రియాశీలంగ పనిచేసింది. సామాజిక, రాజకీయ ఉద్యమాలకు కేంద్రం అయింది. పరమాత్ముడు ఒక్కడే అనిజెప్పే ఆర్యసమాజ్ విగ్రహ పూజను వ్యతిరేకించింది. జంతుబలులు, మద్యపానం, మాంసాహారానికి వ్యతిరేకంగా జనాన్ని చైతన్యం చేసింది. ఎక్కడైనా హిందువుల్ని జబర్దస్తీగ మతం మార్చితే , ఆర్యసామాజికులు అక్కడికి పోయి శుద్ధి కార్యక్రమం చేసేది. అటెంక వాళ్లను మళ్లీ హిందువులుగ మార్చేటోళ్లు. పండిత రుద్రదేవ్, గోపదేవ్ లాంటి ఆర్యసామాజికులు ఈ ఉద్యమంల ప్రధాన పాత్ర పోషించిన్రు.

ఆర్యసమాజ్.. జీవితాన్ని మలుపుతిప్పింది

హిందూ మతోద్ధరణ, సాంఘిక సంస్కరణలే కాదు, చదువు అవసరాన్ని కూడా ఆర్యసమాజ్ గుర్తించింది. ముఖ్యం గ అణగారిన వర్గాల కోసం ప్రత్యేక బడులు నడిపిం ది. హైదరాబాద్ సంస్థా నంల అధికార భాష ఉర్దూ కావడంతో సర్కార్ బడులల్ల ఉర్దూ మీడియంలనే చదువు చెప్పేది. మాతృభాషల చదవలేనివాళ్ల  కోసం ఆర్యసమాజ్ తెలుగు మీడియం స్కూళ్లను షురూ చేసింది. జాతీయ భావాలు, స్వాతంత్ర్య ఉద్యమం పాఠాలు కూడా అక్కడ చెప్పేటోళ్లు. సుల్తాన్ బజార్ ల ఉన్న అట్లాంటి స్కూల్ లనే ఒకటో తరగతి నుం చి ఐదు వరకు చదువుకున్న. అక్కడ చదువుతున్నప్పుడే నా ఆలోచనల్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులల్ల చాలామంది ఆర్యసమాజ్ నుంచి వచ్చినోళ్లే. అట్లాంటి లీడర్లల స్వామి రామానంద తీర్థ ఒకడు. కర్నాటక గుల్బర్గాల పుట్టిన తీర్థ, ఔరంగాబాద్ ల చదువుకున్నడు. అటెంక మహారాష్ట్రల్నే టీచర్ గ పనిచేసిండు. నిస్వార్థ రాజకీయం, నీతి, నిజాయతీలకు రామానంద తీర్థ ప్రతీక. 1938ల నిజాం సంస్థానంల కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించి, నా అట్లాంటి ఎందరో పోరగాళ్లకు రామానందతీర్థ ఆదర్శమయిండు.

నిజాంకు అబద్ధం జెప్పి గాంధీని తీసుకొచ్చిన్రు

నిజాం పాలనల రాజకీయ వేదికలకు చోటులేదు. అందుకే స్టేట్ కాంగ్రెస్ పై నైజాం సర్కార్ నిషేధం విధించింది. దీంతో గాంధీ హైదరాబాద్ పర్యటన కష్టమైంది. అప్పట్ల స్వా తంత్ర్య ఉద్యమానికి ప్రజల్ని ఏకం చేయడానికి గాంధీ దేశమంతా తిరుగుతుండె. ఆయన్ని నిజాం సర్కార్ హైదరాబాద్ రానియ్యలేదు. హైదరాబాద్ ల ఉన్న ఇస్కూళ్లను చూపిస్తమని నిజాం సర్కార్ కు అబద్ధం జెప్పి కాంగ్రెస్ లీడర్లు గాంధీని తీసుకొచ్చిన్రు. అట్లా 1941ల అనుకుంట పుత్లీబౌలిల ఉన్న వివేకవర్ధిని స్కూల్ కు గాంధీ వచ్చిండు. ఆయనను చూసెటందుకు మా స్కూల్ నుంచి పిల్లలమంత పోయినం. చేతిల కట్టె, నడుముకు పంచెతో సాదాసీదాగా మా ముందు నడుచుకుంట పోయిన గాంధీని దగ్గరగ చూసినంక, ఎందుకో ఆయనకు మస్తు ఇజ్జత్ ఇయ్యాలనిపించింది. మీరు నమ్ముతరో లేదో కని ఆయనోలె సింపుల్ గ బతకాలని ఆ క్షణమే అనుకున్న. అప్పుడు నాకు 12 ఏండ్లు. ఆ వయసుల రాజకీయాలన్న ముచ్చటే తెల్వదు. అయినా ఎందుకో అప్పుడు అట్ల అనిపించింది. తర్వాతి రోజులల్ల నేను కాంగ్రెస్ వాదిగా మారడానికి గాంధీ దర్శనభాగ్యమే కారణం.

ఉద్యోగం చెయ్యాల్నంటే ఉర్దూ రావాలె!

ఆర్యసమాజ్ స్కూల్ల ఐదో తరగతి చదివినంక మా నాయన నన్ను మొగల్ పురాల వస్తానియా బడిల శరీక్ చేసిండు. కొత్త బడిల ఎందుకు చేర్పిస్తున్నవ్ నాయన అని అడిగితే “తెలుగు మీడియంల చదివితే ఉద్యోగం రాదు. ఉర్దూల చదివితేనే వస్తది. అందుకే స్కూల్ మార్పిస్తున్న” అని చెప్పిండు. నాయన అట్ల అనుకోవడంలోనూ న్యాయం ఉంది. ఎందుకంటే నిజాం జమానాల ఉద్యోగం చెయ్యాల్నంటే ఉర్దూ రావాలె. వస్తానియా స్కూల్ ల మూడో తరగతి నుంచి ఏడు దాకా చదువుకున్నా. తరువాత రైమా హైస్కూల్ల చేరి ఉర్దూ మీడియంల మెట్రిక్ చదివిన.

ఆ టైంలనే అంటే 1944లో జవాన్ ఉద్యోగానికి నాయన ఇస్తిఫా ఇచ్చిండు. దీనికో బలమైన కారణం ఉంది. అప్పటికే తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ ల నిజాం పాలనకు వ్యతిరేకంగా జనం పోరాడుతున్నరు. ఆ ఉద్యమాలను నిజాం సర్కార్ పాశవికంగా అణిచివేస్తోంది. సొంత జనంపైనే దాష్టీకం ఏందన్న ఆలోచన నాయనకు వచ్చింది. కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంట కానీ నిజాం తాన మాత్రం పని చేయద్దనుకున్నడు. అందుకే జవాన్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఓ మేస్త్రీ దగ్గర కూలికి పోయిండు. ఆ రోజుల్ల మా పెదనాయనకు నిర్మాణరంగంల మంచి పేరుంది. దాంతో పెదనాయన ప్రోత్సాహంతో నాయన చిన్న కాంట్రాక్టు పనులు చేసిండు. అన్న నర్సింహులు ఈ పనులల్ల నాన్నకు సాత్ దార్ ఇచ్చిండు. అయితే నాన్నకు లౌక్యం లేకపోయేది. బోళా మనిషి. మంచితనం వ్యాపారానికి పనికి రాదు కదా. దాంతో కాం ట్రాక్టు పనులల్ల బాగా నుక్సాన్ వచ్చింది. తిండికి తన్లాడే పరిస్థితి వచ్చింది. ఈ బాధలు పడలేక భార్య పిల్లల్ని వదిలిపెట్టి అన్న నర్సింహులు మద్రాస్ స్టేట్‌ల ఆర్కోణం పోయిండు. కూలి చేసుకుని బతికిండు.

(ఇంకా ఉంది/ వచ్చేవారం: నిజాంతో పోరాటం)

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy