కేరళ రక్షకులు… మత్స్యకారులు

వాళ్లది నిత్యం బతుకు పోరాటం. రెక్కాడితే డొక్కాడని బతుకులు.. అయితేనేం.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించి రియల్ హీరోలుగా మారారు. పదులు కాదు… వందలు కాదు… వేలమందిని రక్షించి సైనిక పాత్రను పోశిస్తున్నారు. ఆర్మీ తరహాలో వరద బాధితులకు అండగా నిలుస్తూ మంచి మనసుతో సహాయక చర్యలు చేపడుతున్నారు మత్స్యకారులు.

 

సొంత ఖర్చులతో..
దుర్భర జీవితం గడిపే మత్స్యకారులైనా సొంత ఖర్చులతో సహాయ చర్యలో పాలుపంచుకుంటున్నారు. ఎక్కడా ఏ ప్రమాదం జరిగినా.. నాటు పడవల్లో వెళ్తూ బాధితులను రక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలు అందిస్తూ.. ఆకలి తీరుస్తున్నారు. నాటు పడవలను నడిపేందుకు అవసరమైన ఇంధనాన్ని కూడా వీరే సమకూర్చుకుంటున్నారు. అధికారుల ద్వారా సమాచారం తెలుసుకొని నిమిషాల వ్యవధిలో వరద ప్రాంతాలకు చేరుకుని సాయం అందిస్తున్నారు. ‘‘ మా దగ్గర 60 నాటు పడవలున్నాయని, వాటిసాయంతో గల్లిగల్లీలో తిరుగుతూ ఎంతోమందిని రక్షించాం’’ అని తిరువనంతపూర్ కు చెందిన మత్స్యకార్మికుడు అలెక్స్ చెబుతున్నాడు.

జీవనోపాధిని పక్కనపెట్టి…
చేపలు పట్టేందుకు మత్స్యకారులకు ఇదే మంచి సమయం. అయినా వరదల దృష్ట్యా జీవనోపాధిని పక్కకు పెట్టి సహాయ చర్యలు చేస్తూ తమ మానవతను చాటుకుంటున్నారు. ఒక్కసారి చేపలు వేటకు వెళ్తే… రూ. ఐదు వేలు అయినా సంపాదించుకోవచ్చు. తమ ఆదాయాన్ని పక్కనపెట్టి సాయం చేస్తుండటం విశేషం. ఆదాయం కన్నా వరద బాధితులను ఆదుకుంటున్నామనే ఆత్మసంతృప్తి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నాడు మరో మత్స్యకారుడు మహ్మద్.

ఎంతోమందికి రక్షణ
రెండు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలో 18 వేల మందికి రక్షిత ప్రాంతాలకు తరలించగా, అందులో మూడో వంతువారిని మత్స్యకారులే రక్షించారు. సొంత నాటు పడవలతో కొందరు సాయం చేస్తుంటే.. ఆర్మీ అధికారుల అందించిన బోట్ల సాయంతో మరికొందరు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.

మంచికి పైమెట్టు…
కేరళలోని వెంగారా ప్రాంతంలో ఆర్మీ అధికారులు తమ సిబ్బందితో సహాయం అందిస్తున్నారు. కొంతమంది మహిళలు పడవ ఎక్కేందుకు ఇబ్బందులు పడుతుండటంతో కేపీ జైసాల్ అనే మత్స్యకారుడు మరో ఆలోచన లేకుండా తన వీపునే మెట్టుగా మార్చాడు. ఇలా… చెప్పకుంటూపోతే మత్స్యకారులు చేస్తున్న సేవలు ఎన్నో ఉన్నాయి.

ప్రశంసల వెల్లువ
వరద బాధితుల కోసం సొంత ఖర్చులు భరించి మరీ సహాయక చర్యలు చేపట్టడం కేరళ వాసులనే కాకుండా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి విజయన్ అభినందించకుండా ఉండలేకపోయారు. ప్రాణాలకు తెగించి  సాయం చేసిన మత్స్యకారులను ఇంధన ఖర్చులు, మరికొంత ఆర్థికసాయం చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy