కేరళ రియల్ హీరోలకు దేశం సెల్యూట్

మాట సాయం.. డబ్బు సాయం కాదు.. ప్రాణం కాపాడినోడే దేవుడు. పది మంది శత్రువులను చంపినవాడిని వీరుడంటారు.. కానీ ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడంటారని ఈ మధ్యే ఓ సినిమాలో విన్నాం. కేరళలో ఆపదలో ఉన్న వారి పాలిట దేవుళ్లుగా.. వందలాదిమంది అభాగ్యులను కాపాడుతున్న వీరులుగా జన నీరాజనాలు అందుకుంటున్నాయి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్- NDRF, సైన్యం, నేవీ, పోలీస్ బలగాలు.

భారీవర్షాలు, వరదలకు.. ఎన్నో ఊళ్లు, ఇండ్లు, గుళ్లు.. నీటమునిగాయి. గ్రామాలు, కొండ ప్రాంతాల్లో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్న శరణార్థులను ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, కోస్ట్ గార్డ్ టీమ్స్, ఆర్మీ… సహాయక శిబిరాలకు తరలిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే చెరువుల్లా మారడంతో… డాబాలు, అపార్టుమెంట్లపై చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు. ఎర్నాకులంలో ప్రాణాలకు తెగించి .. ఓ యువకుడిని తాడు సహాయంతో రక్షించారు.

త్రిసూరు, అలువా, పెరుంబవూరులో 132 మందిని కాపాడారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. తాడు సహాయంతో భవనాలపై ఉన్నవారిని హెలికాప్టర్లలోకి తీసుకుని… సురక్షిత శిబిరాలకు తరలిస్తోంది ఎయిర్ ఫోర్స్.

అతి భారీవర్షాలతో కేరళలోని 14 జిల్లాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. చాలా నగరాల్లో కరెంట్ సరిగా ఉండటం లేదు.  విద్యుత్ లైన్లను బాగు చేసేందుకు హోరు వర్షంలోనూ కేరళ ఎలక్ట్రిక్ డిపార్టుమెంట్ సాహసాలు చేస్తోంది. ప్రభుత్వ సిబ్బంది.. బృందాలుగా ఏర్పడి ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.

 

ఇటీవల కన్నయ్య కుమార్ అనే ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు చేసిన సాహసానికి దేశమంతా సెల్యూట్ చేసింది. 25 ఏళ్ల తర్వాత ఇడుక్కి ప్రాజెక్టు 25 గేట్లు తెరవడంతో.. వరద ప్రవాహం దిగువ ప్రాంతాల్లో ప్రళయాన్ని చూపించింది. సమీపంలో ఉన్న చెరుతోని బ్రిడ్జి మునిగిపోవడానికి సెకన్ల ముందు… ఓ చిన్నారిని సాహసంతో కాపాడాడు కన్నయ్య కుమార్. పిల్లాడిని ఎత్తుకున్న తండ్రి ఎటు పోవాలో అనే అయోమయంలో ఉండగా.. ఆ పిల్లాడిని తన చేతుల్లోకి తీసుకుని.. తండ్రితో సహా బ్రిడ్జి అవతలి ఒడ్డుకు ఉరికాడు ఆ ఎన్డీఆర్ఎఫ్ ఉద్యోగి. వాళ్లు పరుగెత్తిన కొన్ని క్షణాల్లోనే బ్రిడ్జిని .. వరద నీరు ముంచేసింది.

కేరళ చరిత్రలోనే కనివిన ఎరుగని వరదల్లో సహాయ కార్యక్రమాలకోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న ఎన్డీఆర్ఎఫ్,ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, పోలీస్ బలగాలకు దేశం సెల్యూట్ చేస్తోంది.

 

 

 

 

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy