వెనుకబడిన తరగతుల (OBC) వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. ఈ కమిషన్‌కు ఓ ఛైర్మన్‌ను నియమించి…12 వారాల్లోగా నివేదికను అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓబీసీలను మూడు వర్గాలుగా విభించాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో సిఫార్సు చేసింది. అత్యంత వెనుకబడిన తరగతులు, మరింత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతులుగా విభజించాలని వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ సిఫార్సు చేసినట్లు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారికత మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తెలియజేశారు.
అత్యంత వెనుకబడి తరగతులను మళ్లీ ప్రత్యేక వర్గాలుగా విభజించాలని వారిలో సంచార జాతులు, పాక్షిక సంచార జాతులు, విముక్త జాతి, నామమాత్రపు సంచార జాతులు ఇలాంటి వారిని ఉప-కేటగిరీలుగా విభజించాలి. ఇలా విభజించడం వల్ల వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతుల వారికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుసుకోవచ్చన సిఫార్సు చేసింది. క్రిమిలేయర్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉపాధి, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు కల్పించిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ సిఫార్సుల ప్రకారం OBCలను మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నారు.