RBIకి తెలంగాణ ప్రభుత్వం వినతి : మాకు 5 వేల కోట్లు పంపండి

rbi-notesపెద్దనోట్లను రద్దుచేసిన రోజుల్లో మాదిరిగానే మళ్లీ కరెన్సీ కష్టాలు తలెత్తడంతో అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే ఐదు వేల కోట్ల రూపాయల నగదు పంపాలని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. అందులో తక్కువ విలువ కలిగిన చిన్ననోట్లను ఎక్కువగా పంపాలని కోరినట్టు చెప్పారు అధికారులు. దీనికితోడు రైతులకు ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున అందించనున్న పెట్టుబడి పథకానికి మరో ఆరువేల కోట్ల రూపాయల దాకా అవసరం. అయితే, పెట్టుబడి సహాయాన్ని తమకు చెక్కుల రూపంలో ఇస్తే మంచిదని రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా చెక్కుల రూపంలో ఇవ్వటానికే మొగ్గు చూపుతూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఓవైపు పెట్టుబడి సహాయం రూపంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే మళ్లీ నోట్ల సమస్య తెరమీదకు వచ్చింది. బ్యాంకులలో కనీస నగదు నిల్వలు లేక.. ఏటీఎంలలో డబ్బులు రాలక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సంక్రాంతికి కాసుల కొరత…అందుబాటులో 20 వేల కోట్లే

సంక్రాంతి పండుగ ముంగిట ఒక్కసారిగా నగదు కొరత తలెత్తడంతో అవసరాలకు జేబులో డబ్బులేక సామాన్యులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నవారు తిరిగి డిపాజిట్ చేయకుండా దాచుకోవడం.. ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లను వాపసు తీసుకుని వివిధరంగాలలో పెట్టుబడులకు మళ్లించడంతో నగదు నిల్వలు తరిగిపోయాయి. రూ.2,000 నోట్లు చాలావరకు తిరిగి రావడంలేదు. దేశవ్యాప్తంగా ఇదేపరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ దాదాపు రూ.15 లక్షల 90 వేల కోట్ల వరకు ముద్రించగా అందులో కేవలం ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల వరకు మాత్రమే ప్రస్తుతం బ్యాంకులలో అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ రిసల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్(ఎఫ్‌ఆర్డీఐ) బిల్లును తీసుకురావాలని నిర్ణయించటంతో చాలామంది బ్యాంకులలో ఉన్న తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఉపసంహరించుకున్నారు. ఇంతవరకు డిపాజిట్ల రూపంలో ఉన్న నగదును బంగారం కొనుగోలు, రియల్‌ఎస్టేట్, స్టాక్‌మార్కెట్లకు మళ్లించారు. దీంతో నగదునిల్వలు మరింత తరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో రూ.70 వేల కోట్లు బ్యాంకులలో అందుబాటులో ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ.20 వేల కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఏటీఎంలో నో క్యాష్…

గత కొన్నిరోజులుగా ఏటీఎంలలో డబ్బులు ఉండడంలేదు. మూడురోజులుగా ప్రజలు ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడువేల ఏటీఎంలు అలంకారప్రాయంగా మారాయి. సంబంధిత బ్యాంకులు ఏటీఎంలలో డబ్బు పెట్టకుండా దాదాపుగా ఉపసంహరించాయి. మిగతావి సాధారణంగా పనిచేస్తున్నాయి. బ్యాంకులు ఏటీఎంలలో గతంలో కంటే తక్కువ నగదు ఉంచుతున్నా మొన్నటి వరకు పెద్దగా సమస్యలేదు.  కానీ మూడురోజులుగా అసలు నగదునిల్వలు లేక అన్నిబ్యాంకుల ఏటీఎంలు దాదాపు 60% వరకు తలుపులు మూసుకున్నాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy