RTC నియామకాల్లో నిబంధనలు సడలింపు

TSRTCతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TS RTC) డిపెండెంట్‌ అపాయింట్‌మెంట్స్‌ (కారుణ్య నియామకాల) విషయంలో మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న పలు కఠినమైన నిబంధనలను సడలించింది. ముఖ్యంగా 5 ప్రధాన నిబంధనల్లో మార్పులు చేశారు అధికారులు. దీంతో కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగాలు లభించే అవకాశాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా కుటుంబాల్లోని యువతులు కండక్టర్‌ జాబ్‌లు పొందాలంటే ‘కనీస ఎత్తు’ ప్రతిబంధకంగా ఉండేది. ఇంట్లో ఎవరైనా ప్రైవేటు ఉద్యోగంచేసినా, ఏదైనా ప్రైవేటు సంస్థలో అటెండర్‌గా ఉన్నా.. ఆర్టీసీలో ఉద్యోగం ఇచ్చేవారు కాదు. ఇలాంటి కఠిన నిబంధనలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారు. చాలామందికి న్యాయం జరిగేలా నిబంధనలను మార్చారు. నిబంధనల్లో సడలింపులిస్తూ ఆర్టీసీ ఎండీ రమణారావు శనివారం (జులై29) అంతర్గత ఉత్తర్వులను జారీచేశారు. రాష్ట్రంలోని 10 రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయాలకు ఈ ఉత్తర్వులను పంపించారు. వాస్తవానికి ఆర్టీసీలో డిపెండెంట్‌ అపాయింట్‌మెంట్స్‌ ఉమ్మడి రాష్ట్రం నుంచే అమలవుతున్నాయి. సంస్థలో పనిచేసే కండక్టర్‌, డ్రైవర్‌, శ్రామిక్‌ వంటి ఉద్యోగులు చనిపోతే.. వారి కుటుంబాల్లోని ఒకరికి డిపెండెంట్‌ జాబ్‌ను ఇస్తారు. అయితే.. 2002 నుంచి 2012 వరకు ఇలాంటి నియామకాలను నిలిపివేశారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 1572మంది భవితవ్యం అందోళనలో పడింది.

అయితే…ఆర్టీసీలోని కార్మిక సంఘాలు అప్పటి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చల ఫలితంగా అనుమతి ఇచ్చారు. దాంతో ఆ 1572 మందికి ఉద్యోగాలు దక్కాయి. అందులో తెలంగాణ ప్రాంతంలోనివారు 500కు పైగా ఉన్నారు. 2012 నుంచి ఈ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు ఆర్టీసీ బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. అయినా.. రీజినల్‌ మేనేజర్లు ‘అప్రూవల్‌ పెండిం గ్‌’ పేర నియామకాలు చేస్తున్నారు. తమ పరిధిలోని ఖాళీల మేరకు కొత్తవారిని తీసుకుంటున్నారు. 3 నెలల నుంచి నియామకాల్లేని కార్మిక సంఘాలు ఆరోపిస్తుండగా.. ఖాళీలు లేకపోవడంవల్లేనని అధికార వర్గాలు చెబుతున్నా యి. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 10 రీజియన్లకు సంబంధించి 110 వరకు డిపెండెంట్‌ పోస్టుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కానీ.. 250వరకు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.

సడలింపులు:

…….ఇదివరకు డ్రైవర్‌, కండక్టర్‌, శ్రామిక్‌ పోస్టులకే డిపెండెంట్‌ అపాయింట్‌మెంట్స్‌ వర్తించేవి. ప్రస్తుతం వీటికి అదనంగా సెక్యూరిటీ గార్డు(ఆర్టీసీ కానిస్టేబుల్‌) పోస్టును చేర్చారు. సెక్యూరిటీ గార్డులు చనిపోయినా.. వారి కుటుంబ సభ్యులకు డిపెండెంట్‌ పోస్టులను వర్తింపజేస్తారు.

…….సంస్థలో పనిచేసే కార్మికుడు/కార్మికురాలు చనిపోతే.. వారి కొడుకు లేదా పెళ్లికాని కూతురికి ఉద్యోగం ఇచ్చేవారు. ఇక మీదట పెళ్లి అయిన కూతురికీ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.

…….ఇదివరకు కార్మికుడు చనిపోయిననాటి నుంచి ఐదేళ్లలోపు దరఖాస్తు చేసుకుంటేనే ఉద్యోగం ఇచ్చేవారు. తాజాగా ఈ గడువును పదేళ్లకు పెంచారు. అంటే.. కార్మికుడు చనిపోయిన నాటి నుంచి పదేళ్లలోపు ఎప్పుడైనా కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

…..కండక్టర్‌ పోస్టుల విషయంలో మహిళలకు ‘ఎత్తు నిబంధన’ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం కండక్టర్‌ పోస్టుకు కనీస ఎత్తు 153 సెంటిమీటర్లు ఉండాలి. దీనిని సవరిస్తూ ఎత్తును 147 సెంటి మీటర్లకు తగ్గించారు. దీంతో మహిళలు కూడా అర్హత సాధించే అవకాశం ఉంది.

…..డిపెండెంట్‌ జాబ్‌ ఇవ్వాలంటే.. వారి ఇంట్లో ఇంకా ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండరాదు. ప్రైవేటు సంస్థలో అటెండర్‌ జాబ్‌ చేస్తున్నా ఉద్యోగం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం.. ప్రైవేటు సంస్థలో ఉద్యోగంచేసినా డిపెండెంట్‌ జాబ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర, ప్ర భుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో పనిచేసేవారు ఉంటే.. జాబ్‌ ఇవ్వరు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy