sarfaroshi ki tamannaa…

bismil Ashfaq_Ulla_Khan

 

రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ లు ఎవరో మీకు తెలుసా ? కాకోరీ కుట్ర కేసు గురించి విన్నారా ? నిండా ముప్పై ఏళ్లు లేని యువకులు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ ఘట్టాన్ని ఈ రోజైనా గుర్తు చేసుకోవాలి. సర్ఫరోషీ కీ తమన్నా… అంటూ జాతిని ఉత్తేజితం చేసిన ఆ గొంతు. తన సహచరులతో కలిసి ఉరితాటి బిగిపట్టులో మూగబోయి ఈ రోజుకి సరిగ్గా ఎనభై ఏళ్లు. అవును 1925లో ఉత్తర్ ప్రదేశ్ లోని కాకోరీ దగ్గర్లో రైలులో వెళ్తున్న బ్రిటీష్ ప్రభుత్వ నిధులను అత్యంత సాహసోపేతంగా దోపిడీ చేసిన పదిమంది యువకులలో నాయకులైన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ లతో పాటు రాజేంద్రనాథ్ లాహిరీ, రోషన్ సింగ్ లను 19 డిసెంబర్ 1927న సరిగ్గా ఈ రోజే దుష్ట బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది ?

బిస్మిల్ స్థాపించిన హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ – HRA బ్రిటీష్ పాలన ముగింపుకు సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన యువయోధుల పార్టీ. సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ, మన్మద్ నాథ్ గుప్తా, చంద్రశేఖర్ ఆజాద్, లాలా హర్ దయాళ్, డాక్టర్ జాదూ గోపాల్ ముఖర్జీ వంటివాళ్లు మార్గదర్శనం, ముఖ్యపాత్రలతో ఏర్పడ్డ HRA తర్వాతి రోజుల్లో భగత్ సింగ్, ఆజాద్, సుఖ్ దేవ్ ల సమయానికి హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ గా మారింది.

ఐతే HRA ఏర్పడ్డ తొలిరోజుల్లోనే చేసిన సంచలనాత్మక కార్యం కాకోరీ రైలు దోపిడీ. తమ తిరుగుబాటు కార్యకలాపాలకు అవసరమయ్యే నిధులు కూడా దుష్ట బ్రిటీష్ ప్రభుత్వం నుండే లాక్కోవాలన్న డేరింగ్ ఆలోచనే ఈ రైలు దోపిడీ. ఆగస్టు 9, 1925న సహరన్ పూర్ నుంచి లక్నో వెళ్తున్న ‘నంబర్ 8 డౌన్’ రైలులో ఒకపెట్టెలో వెళ్తున్న బ్రిటీష్ ప్రభుత్వ సొమ్ములను దోచుకోవాలనేది పథకం. పదిమంది యువకులు, కేవలం నాలుగే ‘మాజర్’ రకం చేతి తుపాకీలతో ఈ కార్యాన్ని సాధించారు. ఒక గన్ ప్రమాదవశాత్తు పేలి ఒక ప్రయాణికుడు చనిపోయాడే తప్ప.. ఇంతటి సాహసకార్యం ఎలాంటి చెడు ఘటనలు లేకుండా ముగియడం విశేషం.

బ్రిటీష్ ప్రభుత్వంపై కొందరు యువకులు జరిపిన ఈ దాడిని ‘కాకోరీ కుట్ర కేసు’గా ముద్రవేసి విచారణ చేసింది విదేశీ ప్రభుత్వం. నలభై మందిని అరెస్ట్ చేసి విచారించిన ప్రభుత్వం, 1927లో బిస్మిల్ తదితరులకు ఉరిశిక్ష విధించింది.

‘బిస్మిల్’ గా పేరు తెచ్చుకున్న రామ్ ప్రసాద్ హిందీ, ఉర్దూలలో గొప్ప  కవిత్వం రాసాడు. ఆయన రాసిన ‘‘సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై,. దేఖ్ నా హై జోర్ కిత్నా బాజూయే  కాతిల్ మే హై’’ అనే పాట స్వతంత్ర పోరాటంలో తరువాత వచ్చిన ప్రతీ యోధుణ్ణీ ఉత్తేజిత పరిచింది. బిస్మిల్ లాగే అతివాదిగా పేరుతెచ్చుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ బిస్మిల్ ను గొప్ప స్ఫూర్తిగా భావించేవాడు. భగత్ సింగ్ బిస్మిల్ పాటలను, ముఖ్యంగా  ‘‘సర్ఫరోషీ’’ గీతాన్ని తరుచూ పాడేవాడని చెబుతారు. బిస్మిల్ తన రచనలన్నింటినీ ‘‘సుశీల్ మాలా’’ పేరుతో సంకలనాలుగా ప్రచురించాడు.

బిస్మిల్ తో సమానంగా నిలబడ్డ అష్ఫకుల్లా ఖాన్ కూడా కవియే. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొదటి ముస్లిం ఇతను. ఇరవై ఏడేళ్ల వయసుకే ప్రాణాలు కోల్పోతున్న సమయంలో కూడా జైలులో ఈయన ప్రదర్శించిన ధైర్యం, అతనిలోని ప్రశాంతతను గురించి బ్రిటీష్ జైలు అధికారులు కూడా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. ఫైజాబాద్ జైల్లో ఉరితాడును ముద్దాడి మెడలో వేసుకున్నాడట అష్పాక్ !

స్వాతంత్ర చరిత్రలో మరిచిపోలేని ఘటనగా నిలిచిన ‘‘కాకోరీ ఉదంతం’, అందులోని ప్రధాన పాత్రధారులను ఆధారంగా ఈ మధ్యే వచ్చిన ‘‘రంగ్ దే బసంతీ’’ తో పాటు అనేక సినిమాలు వచ్చాయి. భగత్ సింగ్ పై తీసిన అన్ని సినిమాల్లో కూడా ‘‘సర్ఫరోషీ’’ గీతం ప్రముఖంగా ఉంటూ వచ్చింది.

ఈ వీరుల స్మారకంగా ఇండియన్ రైల్వే షాజహాన్ పూర్ దగ్గర ఒక స్టేషన్ కు రాంప్రసాద్ బిస్మిల్ పేరుపెట్టింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అష్ఫకుల్లా ఖాన్ పేరు ఒక జూకు పెట్టింది. షహీద్ స్మారక్ పేరిట కాకోరీ దగ్గర కూడా నిర్మాణం ఉంది.  1997 బిస్మిల్ స్మారకం స్టాంపు కూడా విడుదలైంది.

ఈ వీరుల ఆత్మసమర్పణ దినమైన ఈరోజు వీరి స్ఫూర్తిని దేశ యువత మదిలో నిలుపుకోవాలని ఆశిస్తూ… నివాళి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy