చంద్రుడినీ వదలట్లేదు.. ఖనిజాల తవ్వకంపై గురి

భూమిపై మనకు ప్రకృతి ఇచ్చిన ఎన్నో సహజ వనరులను అవసరానికి మించి వాడేశాం. ఎంతో అందమైన కొండ గుట్టల్లో దాగిన ఖనిజాలను భూమి అడుగంచుల దాకా వెళ్లి తవ్వేశాం. పెట్రోల్, గ్యాస్ లాగేసి వాడకంతో కాలుష్యం పెరిగి భూతాపతంతో అల్లాడుతున్నాం… వీటన్ని వల్ల భూమి మరికొన్ని దశాబ్దాల తర్వాత మనిషి బతకడానికే పనికి రాదన్న భయం పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ‘కొత్త ఇంటి (గ్రహం)’ కోసం వెతుకులాడుతున్నాం.

అక్కడ మనిషి బతకొచ్చా…

చంద్రుడు లేదా మార్స్ పై బతకడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయేమోనని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో భాగంగా అమెరికా క్యూరియాసిటీ రోవర్ తో మార్స్ పై మనిషి బతకగలడా? అని పరిశోధిస్తోంది. ఇండియా చంద్రయాన్-1తో చంద్రుడిపై నీటి జాడను గుర్తించింది. ఇప్పుడు చంద్రయాన్-2కు సిద్ధమవుతోంది. చైనా కూడా చీకటి చంద్రుడిపై దిగుతానని చెప్పిన చేసి చూపించింది. పత్తి పండిస్తానని విత్తు నాటింది. మొక్క చిగురించింది. ఇక జీవానికి ఢోకా లేదన్న ఆశ పుట్టే లోపే అది చచ్చిపోయింది. ఇలా చంద్రుడిపై చాలా దేశాలు కన్నేస్తున్నాయి.

అంతలోనే ఖనిజాల వేట
తాజాగా యూరప్‌ కూడా చందమామపై దృష్టి పెట్టింది. తవ్వేస్తానంటోంది. చంద్రుడిపై ఖనిజా నిక్షేపాలను తవ్వి తీస్తుందట. చంద్రుడిపై బేస్‌ ఏర్పాటు చేసేందుకు రాకెట్లను తయారు చేసే ఏరియన్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నామని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) వెల్లడించింది. 2025 నాటికి జాబిల్లిపైకి వెళ్లి పని
మొదలుపెడతామని తెలిపింది. చంద్రుడిపై ఉండే వనరులను ఉపయోగించుకుంటామని చెప్పింది. ‘‘చంద్రుడిపై మనిషిని పంపడమొక్కటే కాదు. అక్కడ దొరికే వనరులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా పరిశోధనలు చేస్తాం. అందుకే చందమామ ఉపరితలంపై ఉండే మట్టి (రీగోలిత్‌) పొరలను తవ్వుతాం ’’అని ఈఎస్‌ఏ చెప్పింది. అంతరిక్షంలో దొరికే ప్రతి వనరునూ భూమిపైనా వాడుకోవచ్చని అంటోంది. రీగోలిత్‌ నుంచి నీళ్లు, ఆక్సిజన్‌ను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. వాటితోనే అంతరిక్షంలో మరింత దూరం వెళ్లేందుకు ఇంధనాన్ని తయారు చేసే వీలు చిక్కుతుందని అంటోంది. ఈ ఏడాది చివర్లో జరిగే స్పేస్‌ 19+ సదస్సులో దీనిపై నిర్ణయాన్ని ఖరారు చేస్తామని ఈఎస్‌ ఏ హ్యూమన్‌ అండ్‌ రోబోటిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డేవిడ్‌ పార్కర్‌ తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy